నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది: ఖర్గే

నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది: ఖర్గే
న్యూఢిల్లీ: బీజేపీ హయాంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ‘ఏడాదికి 2 కోట్ల చొప్పున పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు యువత ఉద్యోగాలు ఊడగొట్టారు. 12 కోట్ల మంది జాబ్స్ కోల్పోయారు. 2012తో పోలిస్తే మోదీ హయాంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్​మెంట్(ఐహెచ్ డీ) రిలీజ్ చేసిన రిపోర్టును ప్రస్తావించారు. ‘‘మన దేశ నిరుద్యోగుల్లో 83% మంది యువతే ఉన్నారని రిపోర్టులో తేలింది. రూరల్ ఏరియాల్లో కేవలం 17.5% మంది యువత మాత్రమే రెగ్యులర్ పనుల్లో ఉన్నారని వెల్లడైంది. ఈసారి ఓటేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించండి” అని ఖర్గే విజ్ఞప్తి చేశారు.