- వారసత్వ జాబ్ ల కోసం ఏండ్లుగా ఎదురుచూపు
- మెడికల్ బోర్డును ఏర్పాటు చేయని యాజమాన్యం
- ఆర్థికంగా అప్పుల పాలైతున్న పలు కుటుంబాలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో దశాబ్దాల పాటు సేవలందించి మెడికల్‌బోర్డు ద్వారా అన్ఫిట్అయిన కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. అటు జీతం రాక, ఇటు కొడుకులకు కొలువుల్లేక ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. సింగరేణిలో దాదాపు వందలాది మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అనారోగ్య కారణాలతో డ్యూటీలు చేయలేక మెడికల్‌బోర్డు ద్వారా కొందరు కార్మికులు ఇన్వాలిడేషన్అయ్యారు.
తమ కొడుకులకు వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో విధుల్లోంచి రిలీవ్అయ్యారు. కానీ కొలువులు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. విజిలెన్స్, ఇతరత్రా కేసులంటూ కొందరు కార్మికుల పిల్లలకు ఏండ్లుగా జాబ్ లు ఇవ్వడంలేదు. ఇంకొందరికి ఐదేండ్లు, రెండేండ్లు తక్కువలో తక్కువగా 4 నెలలుగా జీతాలు లేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎట్లనైనా వారసత్వ జాబ్ వస్తదని తమకు వచ్చిన డబ్బులను కొడుకులు, కూతుళ్లకు పంచారు. కొందరేమో ఇండ్లు కొనుక్కున్నారు. తీరా కొడుకులకు కొలువులు ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుండడంతో పింఛన్ డబ్బులు సరిపోక అప్పుల పాలవుతున్నారు.
ఏజ్ దాటుతుందని..
మరో వైపు తమ కొడుకులకు ఏజ్ దాటుతుందని అన్ఫిట్అయిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సర్వీస్‌లోనూ వెనుకబడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలలుగా మెడికల్బోర్డును ఏర్పాటు చేయకుండా యాజమాన్యం నిలిపి వేసింది. ఇదే క్రమంలో కంపెనీలో సర్ప్లస్కార్మికులు ఉన్నారని పలు సందర్భాల్లో పేర్కొంది. ఈ క్రమంలో తమ కొడుకులకు జాబ్ లు వస్తాయే రావోననే భయం కార్మికుల్లో నెలకొంది. యాజమాన్యం స్పందించి తమ కొడుకులకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
వెంటనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
మెడికల్‌బోర్డు ద్వారా అన్ ఫిట్అయిన కార్మికుల కొడుకుల జాబ్ లు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోంది. వారసత్వ ఉద్యోగాలపై గుర్తింపు సంఘంతో జరిగిన పలు మీటింగ్‌ల్లో యాజమాన్యానికి చెప్పాం. జీతం రాక, కొలువు లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. త్వరలోనే కొలువులు ఇస్తామని యాజమాన్యం చెప్పింది. వెంటనే ఇవ్వకుంటే యూనియన్ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.
మిర్యాల రంగయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ
ఆర్నెళ్లుగా ఎదురు చూస్తున్నాం
ఆర్నెళ్లుగా కొడుకు కొలువు కోసం కుటుంబమంతా ఎదురు చూస్తున్నాం. మెడికల్‌బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన ఆనందం కొడుకుకు జాబ్ ఇవ్వకపోతుండడంతో ఆవిరైపోయింది. ఎప్పుడెప్పుడు యాజమాన్యం పిలుస్తుందా అని చూస్తున్నాం. త్వరగా జాబ్ లు ఇచ్చేందుకు యాజమాన్యం చొరవ చూపి అన్ఫిట్ కార్మికులను ఆదుకోవాలి.
వంగా వెంకట్, రిటైర్డ్ఎంప్లాయ్, సింగరేణి కాలరీస్
