సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి ట్రాన్స్‎ఫర్

సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి ట్రాన్స్‎ఫర్

చెన్నయ్: తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోన్న అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి బదిలీ  చేసింది. కేసు విచారణ నిష్పాక్షపాతంగా జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని, సీబీఐ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. 

ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తిరుప్పువనం పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో మరణించిన అజిత్ కుమార్ కేసును సీబీఐకి అప్పగిస్తు్న్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఘటన ఇది ఎవరూ సమర్థించలేని, క్షమించలేని చర్య అని అన్నారు. ఈ కేసులో ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చారని తెలిపారు. కేసు దర్యాప్తు ఎలాంటి పక్షపాతం లేకుండా జరుగుతుందనే సందేహం లేకుండా చూసేందుకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలు ఎక్కడా.. ఎప్పుడైనా జరగకూడదని పేర్కొన్నారు. కేసు విచారణలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు పూర్తి సహకారాన్ని అందిస్తుదని స్టాలిన్ హామీ ఇచ్చారు. 

అసలేమైందంటే..?

తిరుపువనంలోని మాదపురం కాళీఅమ్మన్ ఆలయంలో  27 ఏళ్ల అజిత్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ దొంగతనం కేసులో తిరుపువనం పోలీసులు అజిత్ కుమార్ అరెస్ట్ చేశారు. స్టేషన్ లో విచారణ సమయంలో పోలీసులు కొట్టడంతో అజిత్ కుమార్ మృతి చెందాడు. అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చివరకు ఈ కేసు మద్రాస్ హైకోర్టుకు చేరింది. 2025, జూలై 1న ఈ కేసును విచారించిన హైకోర్టు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ALSO READ | నన్ను కూడా లైంగికంగా వేధించాడు: లా స్టూడెంట్‎పై అత్యాచార నిందితుడిపై మరో యువతి ఆరోపణలు

అధికారంతో మత్తులో ఉన్న పోలీసులు అజిత్ కుమార్‎పై దారుణంగా దాడి చేశారని ఫైర్ అయ్యింది. మృతుడి ఒంటిపై 44 గాయాలు ఉన్నాయని.. ఇది క్రూరమైన చర్య అని పోలీసులపై మండిపడింది. రాష్ట్రం తన సొంత పౌరుడిని చంపుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించిన గంటల్లోనే ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.