ఓ తండ్రి వ్యథ! కళ్లలో కారం కొట్టిన కొడుకు.. భార్య, బామ్మర్దితో కలిసి దాడి

ఓ తండ్రి వ్యథ! కళ్లలో కారం కొట్టిన కొడుకు.. భార్య, బామ్మర్దితో కలిసి దాడి

ఆపద మొక్కులవాడు కొలువైన కొండపై.. తండ్రీ-కొడుకుల బంధానికి ఆపదొచ్చింది. ఇది అభాగ్యుడైన ఓ తండ్రి కథ. స్థానికులు కూడా పాపం అని జాలిపడుతున్న ఓ వృద్ధుడి వ్యథ. తండ్రినే కొడుతున్నవాడు అసలు కొడుకేనా అంటూ ఈసడించుకుంటున్న సంఘటన.

తిరుపతిలో సోమవారం నాడు దారుణం జరిగింది. అనంతవీధిలో మునికృష్ణ అనే వృద్ధుడు.. భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరి ఆలనా పాలనా చూసేవాళ్లు కరువయ్యారు. తన సొంత కష్టమ్మీదే సొంత ఇల్లును కట్టుకుని 20 ఏళ్లుగా భార్యను పోషిస్తున్నాడు ఆ తండ్రి.

మునికృష్ణ కొడుకు విజయ్ కుమార్ చెడు వ్యసనాలకు బానిసై తండ్రిపైనే ఆధారపడి బతికాడు. తన కొడుకు బ్యాంక్ లో లోన్  తీసుకుని.., కోడలు నీరజ తమ్ముడు వంశీ దగ్గర  అప్పులు తీసుకుని… దానికి తమను జమానత్ చేశాడని ఆ తండ్రి అంటున్నాడు. తమకే దిక్కులేదని.. ఆ డబ్బులు తామెలా ఇస్తామని ఆ తండ్రి అంటున్నాడు. ఈ కారణంతో తరచుగా తమపై కొడుకు దాడి చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

సోమవారం నాడు ఆ గొడవ పెరిగి… వీధి దాకా వచ్చింది. కొడుకు, అతడి బామ్మర్ది… వృద్ధుడైన మునికృష్ణను కొడుతూ వీధిలోకి ఈడ్చుకొచ్చారు. కోడలు వంటింట్లో ఉన్న కారం డబ్బా తీసుకొచ్చి … మామ కళ్లలో చల్లింది. ఆ బాధకు పాపం.. ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. రోజూ జరిగే గొడవే.. ఆరోజు మరింత ముదిరి వీధిదాకా రావడంతో.. స్థానికులు ఆవేదన చెందారు. దాడి చేస్తున్న వారిని ఆపారు. కొడుకు, కోడలుకలిసి మునికృష్ణపై చేస్తున్న దాడిని ఫొటోలు తీసి మీడియాకు ఇచ్చారు.

కన్నతండ్రి అని కూడా చూడకుండా.. ఓ కిరాతక కొడుకు ఇలా దాడిచేయడం తమ వీధికే అవమానంగా భావిస్తున్నామన్నారు స్థానికులు.  తన భార్య, బామ్మర్దితో కలిసి తండ్రిపైనే దాడి చేసి తండ్రీ-కొడుకుల మధ్య  విలువలు పోగొట్టాడని బాధపడ్డారు. ఈ ఘటనపై స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.