నీట్​పై అసత్య ప్రచారం చేయొద్దు : ధర్మేంద్ర ప్రధాన్

నీట్​పై అసత్య ప్రచారం చేయొద్దు : ధర్మేంద్ర ప్రధాన్
  • ప్రతిపక్షాలకు  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హితవు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంపై కాంగ్రెస్, ఇండియా కూటమి అసత్యాలను ప్రచారం చేస్తూ.. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా తమ మోసపూరిత విధానాన్ని ఆపాలని ఆయన హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేవారిని తమ ప్రభుత్వం విడిచిపెట్టదంటూ ప్రధాని మోదీ రాజ్యసభలో పేర్కొన్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నీట్‌‌‌‌, నెట్‌‌‌‌ వంటి పోటీ పరీక్షల్లో పేపర్‌‌‌‌ లీకేజీతో సహా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. విపక్షాలు పార్లమెంట్‌‌‌‌లో ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ‘గత, ప్రస్తుత అంశాల్లో దేశాన్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌ది. నీట్‌‌‌‌ విషయంలోనూ వారి ఉద్దేశం బహిరంగంగానే బయటపడింది. సమస్యలను పక్కదోవ పట్టించి.. అస్థిరత సృష్టించాలన్నదే ఇండియా కూటమి ముఖ్య ఉద్దేశం. అసత్యాలు, పుకార్లు పుట్టించి.. తాము దేశ, విద్యార్థి వ్యతిరేకమని  కాంగ్రెస్, ఇండియా కూటమి మరోసారి చెప్తున్నాయి’ అని ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్‌‌‌‌లో రాసుకొచ్చారు.