కేసీఆర్ అకౌంట్ లో వేస్తేనే తెలంగాణకు నిధులు ఇచ్చినట్లా?

కేసీఆర్ అకౌంట్ లో వేస్తేనే తెలంగాణకు నిధులు ఇచ్చినట్లా?

కరోనా స‌మ‌యంలో తెలంగాణ‌కు కేంద్రం సాయం చేయడం లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాన‌ని చెప్పారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు హక్కుగా వచ్చే అన్ని వనరులను కేంద్రం అందిస్తోంద‌ని, కేంద్రానికి ఏ ప్రాంతం, ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదని చెప్పారు. ఆత్మ నిర్భర భారత్ లో లబ్ధి పొందిన రైతులు, మహిళలు, కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా? అని ప్ర‌శ్నించారు. వారి అకౌంట్లో డ‌బ్బులు వేస్తే తెలంగాణ బిడ్డలకు ఇచ్చినట్లు కాదా? కేసీఆర్ అకౌంట్ లో వేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్లు అవుతుందా? అని మండిప‌డ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలకు కేంద్ర సంస్థలే అప్పులు ఇస్తున్నాయ‌న్న విషయాన్ని కిష‌న్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రానికి 13 లక్షల 85 వేల ఎన్ 95 మాస్క్ లు, 2 లక్షల 41 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్ సీక్యూ ట్యాబ్ లెట్లు, రెండు లక్షల ఆర్ఎన్ఏ టెస్ట్ కిట్లు, 3 లక్షల 12 వేల పీసీఆర్ కిట్లను ఇచ్చామ‌ని మంత్రి చెప్పారు. 14 వందల వెంటిలేటర్ల కేటాయిస్తే.. కేవలం 647 వెంటిలేటర్లనే ఇచ్చామని కేసీఆర్ చెప్పడం సరికాద‌ని అన్నారు. దాదాపు 500 వెంటిలేటర్లకు ఇంకా సీల్ కూడా తీయలేదని మండిపడ్డారు. మజ్లీస్ మెప్పు కోసం మోడీ పై దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేయొద్దని చుర‌క‌లంటించారు.

సీఎం పనికి రాని పథకం అంటున్న ఆయుష్మాన్ భారత్ ను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అన్నారు కిష‌న్ రెడ్డి. పనికొచ్చే ఆరోగ్యశ్రీ లో తెలంగాణ ప్రజలకు కరోన ట్రీట్మెంట్ ను ఎందుకు చేర్చలేద‌ని ప్ర‌శ్నిస్తూ.. క‌రోనా వ‌చ్చి ఆరు నెలల అయ్యాక ఆరోగ్య శ్రీ గుర్తు వచ్చిందా అని అడిగారు.రాష్ట్రం ఏర్పడ్డాకా ఇంత వరకు కొత్త రేషన్ కార్డు లు ప్రింట్ చేయలేదన్నారు. కార్డు ల పై కేంద్ర ప్రభుత్వం లోగో వేయాల్సి వస్తుందని ప్రింట్ చేయడం లేదని విమ‌ర్శించారు. కేసీఆర్ కిట్స్ లో కేంద్రం 6 వేలు ఇస్తుంద‌ని.. ఆ కిట్స్ పై మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్ర‌శ్నించారు

కేసీఆర్ కు సచివాలయం పై ఉన్న శ్రద్ధ.. కోవిద్ పై ఉంటే బాగుండేదని  విమ‌ర్శించారు. పారాసిటమల్ తో కరోనా తగ్గుతుందన్న సీఎంకు కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి ఎన్ని లోన్స్ తీసుకున్నారో సీఎం చెప్పాలన్నారు. లేదంటే తాను సీఎం కి వివరాలు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని, తాను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఉంటే నిరూపించాలని అన్నారు. ‘కేసీఆర్ కిట్’, బస్తీ దవాఖానాల్లోనూ కేంద్ర వాటా ఉంద‌ని, కరోనా వేళ‌లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదనడం, అబండాలు వేయడం సరికాదని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంట్ లో సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు కిష‌న్ రెడ్డి.