టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన విముక్తి

టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన విముక్తి

నిర్మల్: తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ సీట్లనూ గెల్చుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. 

‘స్వాతంత్ర్య పోరాట సమయంలో పాదయాత్ర చేసేవాళ్లను చూశాం. కానీ  కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం బండి సంజయ్ సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. మజ్లిస్‌‌కు భయపడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, మహిళల కోసమే ఈ సంగ్రామ యాత్ర చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేదు. కాంగ్రెస్ ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడలేదు. తెలంగాణ గౌరవాన్ని కేవలం బీజేపీ మాత్రమే కాపాడగలదు. మజ్లిస్, టీఆర్‌ఎస్ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతాం. 119 నియోజకవర్గాల ప్రజల్లో చైత్యన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. ప్రతి ఎన్నికలు డబ్బుతో గెలవొచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. సేవ చేసేవాడో కావోలో.. డబ్బుల రాజకీయం చేసే వారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.