రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై అమిత్ షా ఫోకస్

రాష్ట్రంలో బీజేపీ  బలోపేతంపై  అమిత్ షా ఫోకస్
  • వచ్చిన ప్రతిసారి రెండు ఎంపీ నియోజకవర్గాల్లో పర్యటన 
  • ఈ నెల 28, 29 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ టూర్ 
  • సింగరేణి, ఆదివాసీ ప్రాంతాలపై ఫోకస్ 
  • 29న ఆదిలాబాద్ టౌన్​లో సభ  
  • ఏర్పాట్లు మొదలుపెట్టిన రాష్ట్ర నేతలు 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగారు. ఇక నుంచి ఆయన నెలకోసారి రాష్ట్రానికి రానున్నారు. ప్రతి నెల కనీసం రెండ్రోజుల పాటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు ఒక నియోజకవర్గంలో బూత్ కమిటీలతో సమావేశం, రెండో రోజు మరో నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఇప్పటికే అమిత్ షా తొలి టూర్ ఖరారైందని పార్టీ నేతలు చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అమిత్ షా టూర్ ను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదిలాబాద్ సభకు ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై దృష్టి పెట్టింది. ఇకపై అమిత్ షా నెలకోసారి రానుండడంతో పార్టీ క్యాడర్​లో మంచి జోష్ వస్తుందని, ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

వాళ్ల మద్దతే లక్ష్యంగా... 

పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న సింగరేణి కార్మికులు, ఆదివాసీల మద్దతును కూడగట్టడమే లక్ష్యంగా అమిత్ షా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టూర్ సాగనుంది. గోదావరి తీరానికి ఒకవైపు  బొగ్గు గనులు, మరోవైపు ఆదివాసీ ప్రాంతాలు విస్తరించి ఉండడంతో.. అక్కడ బీజేపీకి బలమైన పునాదులు వేసేందుకే షా వస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఉండగా, 12 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఆయా వర్గాల మద్దతు కూడగట్టేందుకు షా ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 28న సింగరేణి ప్రాంతమైన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బూత్ కమిటీల అధ్యక్షులతో షా సమావేశం కానున్నారు. మరుసటి రోజు జోడేఘాట్ ను సందర్శించి, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో మాట్లాడతారు. షా మొదటి రోజు పర్యటన సింగరేణి ప్రాంతంలో సాగనుండగా, రెండో రోజు పర్యటన ఆదివాసీలు ఉండే ఆదిలాబాద్​లో సాగనుంది. ఇక రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. పోడు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్.. ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దీంతో సర్కార్​పై ఆదివాసీల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు షా ఆదిలాబాద్ సభ కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు నమ్మకంతో ఉన్నారు. 

కేసీఆర్ సభకు కౌంటర్​గా.. 

ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు కౌంటర్​గానే ఆదిలాబాద్​లో అమిత్ షా సభ ఉంటుందని రాష్ట్ర నేతలు అంటున్నారు. సభలో బీజేపీ, మోడీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రతి విమర్శకు షా కౌంటర్ ఇస్తారని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ అమిత్ షా బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం కానుండడంతో, ప్రోగ్రామ్​ను విజయవంతం చేసేందుకు వివేక్ అనుచరులు ఇప్పటికే గ్రామ, పట్టణ స్థాయిలో ప్రిపరేటరీ మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, బూత్ కమిటీల నియామకం, ఇంటింటికీ మోడీ సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంతో పాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించడంపై బూత్ కమిటీల సభ్యులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.