థర్డ్ వేవ్‌‌పై అనవసర ప్రచారాలు చేస్తే ఊరుకోం

థర్డ్ వేవ్‌‌పై అనవసర ప్రచారాలు చేస్తే ఊరుకోం

హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ, వైద్య సదుపాయాలు తక్కువని చెప్పారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కలిగిన యూరోప్, యూకేలోని దేశాలతో పోలిస్తే భారత్ లాంటి దేశాల్లో కరోనాను నియంత్రించడం కష్టమన్నారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేస్తే మహమ్మారిని అడ్డుకోవడం సులువవుతుందన్నారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి.. కరోనా నియంత్రణ కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలతోపాటు వ్యాక్సినేషన్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. 

‘కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఆక్సిజన్ ప్లాంట్‌లు, మందులను మోడీ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 15 రోజుల్లో ఆక్సిజన్ కొరతను నిలువరించాం. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 46 ఆస్పత్రులకు 1,400 వెంటిలేటర్‌లు ఇచ్చాం. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటివరకు 80 లక్షల టీకా డోసులు ఇవ్వగా.. అందులో 15 లక్షల వరకు ప్రైవేట్‌కు పంపిణీ చేశాం. దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్‌లు తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించాం. ఈ క్రమంలో భారత్ బయోటెక్ సంస్థకు టీకాల ఆర్డర్‌‌లో భాగంగా అడ్వాన్స్‌‌గా రూ.1,500 కోట్లు చెల్లించాం. థర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారాలు చేయొద్దని, అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కోరుతున్నాం. ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్‌‌మెంట్‌‌లు ఇచ్చే వారిపై జాతీయ విప్తత్తు నిర్వహణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.