జులై11 నుంచి మిడ్ డే మీల్స్ వర్కర్స్ సమ్మె.. జీతం పెంచాలని డిమాండ్

జులై11 నుంచి మిడ్ డే మీల్స్  వర్కర్స్  సమ్మె.. జీతం పెంచాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల 11,12,13 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మిడ్ డే మీల్స్ కార్మికులకు రూ.3వేల వేతనం ఇవ్వాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ సమస్యల పరిష్కారానికి సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే సమ్మె చేపట్టనున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు. గురువారం యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్లో ఉన్న మిడ్ డే మీల్స్ వర్కర్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ.. గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్మికుల వేతనాలను వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీనికి సంబంధించిన జీవో ఇచ్చినా.. ఇంకా అమలు చేయలేదని తెలిపారు. వెంటనే ఆ హామీని నెలవేర్చాలని కోరారు.  కొత్త మెనూను సవరించాలని..స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో  సంఘం రాష్ట్ర నాయకులు ఇందూరు సులోచన, సీహెచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.