అక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా.. సూర్యాపేటలో బహిరంగ సభ

అక్టోబర్ 27న తెలంగాణకు  అమిత్ షా..  సూర్యాపేటలో బహిరంగ సభ

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ ప్రచార స్పీడ్ పెంచింది. అగ్ర నేతలతో సభలు ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యాపేటకు రానున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ఈసారి బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ.. వచ్చే నెలలో రాష్ర్టంలో పెద్ద ఎత్తున బీసీ గర్జన మీటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. 

దీనికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్ సభల్లో మోదీ పాల్గొన్నారు. ఆ రెండు సభలు సక్సెస్ కావడంతో బీసీ గర్జన సభను సైతం గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 28న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, 31న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. వీళ్లు ఏయే నియోజకవర్గాల్లో పాల్గొంటారన్న షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఒకేరోజు వేర్వేరు నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రచారానికి రాగా.. త్వరలో మరికొంత మంది  రానున్నారు. 

జిల్లాలను జోన్లుగా విభజించి..  

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ర్టంలోని 10 ఉమ్మడి జిల్లాలను 6 జోన్లుగా విభజించింది. ఆయా జోన్లకు ఇన్ చార్జులను నియమించింది. అయితే వాళ్ల వివరాలను మీడియాకు వెల్లడించలేదు. జోన్ 1లో ఆదిలాబాద్, కరీంనగర్, జోన్ 2లో నిజామాబాద్ , మెదక్, జోన్ 3లో రంగారెడ్డి, మహబూబ్ నగర్ , జోన్ 4లో నల్గొండ, ఖమ్మం, జోన్ 5లో వరంగల్, కొత్తగూడెం, జోన్ 6లో గ్రేటర్ హైదరాబాద్ ఉన్నాయి. ఈ జోన్లలోని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ  నిర్ణయించినట్లు సమాచారం.