కేసీఆర్​ది విభజించు.. పాలించు విధానం : కిషన్ రెడ్డి

కేసీఆర్​ది విభజించు..  పాలించు విధానం : కిషన్ రెడ్డి
  • స్వలాభం కోసమే జిల్లాల విభజన: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బ్రిటిషర్ల విభజించు.. పాలించు విధానాన్ని రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా.. తన ఆలోచనలు, స్వలాభం దిశగా కేసీఆర్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. జిల్లాల విభజనే దీనికి మంచి ఉదాహరణ అని ఆదివారం కేసీఆర్​కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘జిల్లాల విభజన టైమ్​లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర జిల్లాల మండలాలను తమ జిల్లాల్లో కలిపేలా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. 

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన బంధువులకు టికెట్ కేటాయింపుల్లో ఇబ్బందులు రావొద్దనే ఇలా చేసినట్లు ఆయా జిల్లాల్లో చర్చ జరుగుతున్నది. భూములు కొని వాటి విలువను పెంచడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయించుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ల భూముల దగ్గరే జిల్లా ఆఫీసులు ఉన్నాయి’’అని లేఖలో విమర్శించారు. చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఎవరు అడిగారని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పాలమూరులో ఎక్కువ జిల్లాలు ఏర్పాటయ్యాయన్నారు.

కావాలనే సొంత పార్టీ నేతలతో ఆందోళనలు

‘‘మీ అనుచరుడైన ఓ ప్రముఖ వ్యక్తికి  సహకారం అందించేందుకు రంగారెడ్డి, పాలమూరు జిల్లాను హత్య చేసి ‘కొత్త రంగారెడ్డి’ జిల్లాను సృష్టించి ఇచ్చారు. ఇది ప్రజలకు అర్థం కాకుండా మీ పార్టీ వాళ్లతోనే ఎక్కడికక్కడ ఆందోళనలు చేయించారు. నగర శివారులోని శంకర్‌పల్లిని 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో కలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలను రంగారెడ్డిలో కలిపారు”అని లేఖలో విమర్శించారు. సర్కారు చేసిన తప్పులతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని మండిపడ్డారు.