కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్యారంటీలు.. అమల్లో సాధ్యం కావు : కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్యారంటీలు.. అమల్లో సాధ్యం కావు : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇస్తున్న ఎన్నికల గ్యారంటీలు అమల్లో సాధ్యం కావని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటే.. ఇప్పుడున్న రాష్ట్ర రెవెన్యూ మూడింతలు అవసరమని చెప్పారు. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 

సోమవారం బీజేపీ మీడియా సెంటర్​లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి డ్రామాలు చేస్తున్నాయి. పదేండ్లకు ముందు కాంగ్రెస్ ఏం చేసింది? ఈ పదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందనేది చర్చించకుండా.. డబ్బులు, మద్యం పంచి.. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలో రావాలని చూస్తున్నాయి. 

కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 50శాతం కర్నాటక భరిస్తుంటే.. మిగిలిన 50శాతం కేసీఆర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచి సూట్​కేసుల్లో డబ్బులు బయటికి వెళ్తాయి తప్ప.. ప్రజలకు న్యాయం జరగదు”అని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధుపై బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నదన్నారు.

రెండు చోట్లా కేసీఆర్ ఓటమి ఖాయం

గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారని, బీజేపీ అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలుస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. మోదీ సభలకు మంచి రెస్పాన్స్ వస్తున్నదన్నారు. కామారెడ్డిలో కేసీఆర్​ను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో బరిలో దిగారని ఆరోపించారు. కేసీఆర్, రాహుల్ శీర్షాసనం వేసినా.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేరని అన్నారు. 

‘‘కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నడు. ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్క్ కడ్తామని ప్రకటించడం సరికాదు. ఐటీ పార్కుల్లో కూడా మతం ఉంటుందా? ముస్లింలపై ప్రేమ ఉంటే.. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఒవైసీ బ్రదర్స్ ఆదేశిస్తే.. వాళ్ల మామ పాటిస్తడు.. వాళ్లిద్దరు కనిపిస్తే వంగి వంగి.. సలాములు చేస్తడు’’ అని  విమర్శించారు.

రాహుల్ నీతులు చెప్పుడు ఏంది?

‘‘రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రానికి వంద లెటర్లు రాశానని కేసీఆర్ అంటున్నడు. 50 లెటర్లు బయటపెట్టినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కేసీఆర్​కు లెటర్ రాస్తే.. సమాధానం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి? ఒక్క కేసీఆర్ కాదు.. వందమంది రాహుల్ గాంధీలు, వెయ్యిమంది ఒవైసీలు వచ్చినా.. 2024లో మోదీని ప్రధాని కాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదు”అని కిషన్ రెడ్డి అన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే వారిని చెప్పుదెబ్బలు కొట్టాలని సూచించారు. ‘‘రాహుల్.. నీతులు చెప్పడం ఏంటి? నీ చరిత్ర, నీ పార్టీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీకి రమ్మంటావా? అమరవీరుల స్తూపం వద్దకు వస్తావా? చర్చకు నేను రెడీ.. నువ్వు సిద్ధమా?”అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​లో చేరితే చర్యలేవి?

2014, 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రాహుల్ ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి నిలదీశారు. సోమవారం రాహుల్ కు కిషన్ రెడ్డి లెటర్ రాశారు. కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పదేండ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తు్న్నాయని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల టైమ్​లోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ బయటపడిందని తెలిపారు. కాంగ్రెస్​కు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలిసిపోయిందని లేఖలో పేర్కొన్నారు.