మాగంటి మరణం.. ఓ మిస్టరీ..ప్రభుత్వం విచారణ జరిపించాలి: బండి సంజయ్

మాగంటి మరణం.. ఓ మిస్టరీ..ప్రభుత్వం విచారణ జరిపించాలి: బండి సంజయ్
  • మాగంటి గోపీనాథ్ ఆస్తులపై రేవంత్, కేటీఆర్ కన్నేశారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీగా మారిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన మృతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాగంటి ఆస్తులను కాజేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గోపీనాథ్ కుటుంబసభ్యులు తన వద్దకొచ్చి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గోపీనాథ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారు. 

తండ్రిని చివరి చూపు కూడా చూడకుండా కొడుకును అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల దృష్టి అంతా మాగంటి ఆస్తిపాస్తులపైనే ఉంది. ఆయన ఆస్తిపత్రాలను మార్చి దొబ్బిపోవాలనుకున్నారు”అని వ్యాఖ్యానించారు. నెల క్రితమే మాదాపూర్‌‌‌‌లో మాగంటి కొడుకు తారక్ ఫిర్యాదు చేశారని, అయినా ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. సీఎంకు దమ్ముంటే విచారణ జరిపించి ట్విట్టర్ టిల్లును గుంజుకుపోయి బొక్కలో వేయాలన్నారు. 

మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులు ఉన్నాయని, గోపినాథ్ ఆస్తులు కాజేయాలనే మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారని అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌‌లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. షేక్‌‌పేట, రహమత్‌‌నగర్‌‌‌‌లో జరిగిన సభల్లో మాట్లాడారు. 

కేటీఆర్.. నువ్వు నన్నేం చేయలేవ్.. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం రెండు పార్టీల మధ్య పోటీ కాదని.. హిందూ, ముస్లిం మధ్య జరుగుతున్న వార్ అని బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతమున్న హిందువులు గెలుస్తారా? లేక 20 శాతమున్న ముస్లింలు గెలుస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో హిందువులను ఓటు బ్యాంకుగా మార్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. తనను మతతత్వవాది అంటున్నారని, అలా బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడనని పేర్కొన్నారు. 

‘‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నా సంగతి చూస్తానని ట్విట్టర్ టిల్లు వాగుతున్నాడు. ఆయన తండ్రి కేసీఆరే నన్నేమీ చేయలేకపోయాడు. కేటీఆర్.. నువ్వు నన్నేమీ చేయలేవు. నాపై 109 కేసులు పెట్టినప్పుడే భయపడలేదు”అని అన్నారు. రాష్ట్రంలో ఆర్‌‌‌‌కే (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన నడుస్తున్నదని, జూబ్లీహిల్స్‌‌లో ఒరే (ఒవైసీ, రేవంత్ రెడ్డి) ట్యాక్స్ నడుస్తున్నదని విమర్శించారు.

 ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చుతున్నది. కూల్చిన ఇండ్లన్నీ హిందువులవే. చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజీ కడితే మాత్రం దాని జోలికిపోలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేసి, అక్కడ పేదలకు ఇండ్లు కట్టిస్తాం”అని తెలిపారు.