
- కేంద్రానికి యావత్ దేశం అండగా నిలవాలి: బండి సంజయ్
- ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పాక్ రక్షణ మంత్రే చెప్పిండు
- బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ధి మారట్లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గాం దాడి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు ఉండబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నదని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు. శనివారం హైదరాబాద్ లోని ఎంసీహెచ్ ఆర్డీలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘రోజ్ గార్ మేళా’ అని అన్నారు. పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట నిలబెట్టుకున్న నేత మోడీ అని చెప్పారు. ఇప్పటి వరకు14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. 15వ రోజ్ గార్ మేళా ద్వారా మరో 51 వేల ఉద్యోగాలు నింపుతున్నట్టు పేర్కొన్నారు. అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా సుమారు పది లక్షల లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం నుంచి సుమారు 700 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకుంటున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందని, పేపర్ లీకేజీలు, కాలయాపనతో నిరుద్యోగులకు అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.