- ‘సంగమేశ్వరం కడుతున్నరు సారూ’ అని వార్తలు వచ్చినా పట్టించుకోలేదు: బండి సంజయ్
- కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఒప్పుకుని మన నీళ్లు ఏపీకి తాకట్టు
- కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో దోపిడీ అని ఫైర్
కరీంనగర్, వెలుగు: కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ (సంగమేశ్వరం) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఏపీ పునాది వేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆనాడు ఏపీ సంగమేశ్వరం కడుతున్నదని పత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చినా ఆయన పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. గురువారం కరీంనగర్ రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ పనులను ఏపీ ప్రారంభించినా ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదంటూ.. ‘సంగమేశ్వరం కడుతున్నరు సారూ’ అనే శీర్షికతో వీ6 వెలుగులో వచ్చిన కథనాలను ఆయన ప్రదర్శించారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. దీనిపై పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ప్రగతి భవన్‌లో మీటింగ్ పెట్టుకుని ‘బేసిన్లు లేవ్... భేషజాల్లేవ్’ అని మాట్లాడింది నిజం కాదా?. నాటి మంత్రి రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని ‘రాయలసీమను రతనాల సీమగా మారుస్తా’ అని చెప్పింది నిజం కాదా?” అని కేసీఆర్‌ను బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కవితకు హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. రోజా ఇంట్లో దావత్ వెనుక ఉన్న మర్మమేందో కూడా ఆమె బయటపెట్టాలని కోరారు.
నీళ్ల పేరుతో నాటకం..
ఆరు గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ కలిసి.. నీళ్ల పేరుతో నాటకాలాడుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలాడారని, పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమం చేసింది బీజేపీయేనని పేర్కొన్నారు. ‘‘ఏపీ పునర్విభజన యాక్ట్ లోనూ తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే. సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజన నాటికి నిర్మాణంలో, ప్లాన్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులపై అభ్యంతరం తెలపొద్దని స్పష్టంగా ఉంది. ఆ యాక్ట్‌లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పొందుపర్చలే? కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలు...తెలంగాణ ప్రజలకు శాపాలయ్యాయి. ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటాలో 811 టీఎంసీలుంటే.. ఏనాడూ తెలంగాణకు 200 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకుండా ఇక్కడి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్సే. గోదావరిలో 1,486 టీఎంసీల నీటి వాటా ఉంటే... తెలంగాణలో ఎన్నడూ 500 టీఎంసీలకు మించి వాడుకోలేదు. పునర్విభజన యాక్ట్‌లోని సెక్షన్ 89లో పాలమూరు ప్రస్తావనే లేనప్పుడు జాతీయ హోదా ఎట్లా అడిగారు?” అని ప్రశ్నించారు.
ఏపీకి అమ్ముడుపోయిండు..
నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్‌లైన్ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సాక్షిగా 299 టీఎంసీల నీళ్లు చాలని సంతకాలు చేశారని, ఆ ఒప్పందాన్ని మొట్టమొదట తానే బయటపెట్టానని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన అంగీకార పత్రాలను చూపించారు. ‘‘తెలంగాణ వచ్చాక ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుంచి ఏకంగా 13.7 టీఎంసీలకు పెంచినా నోరు మెదపని సన్నాసి కేసీఆర్. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం కట్టి దోపిడీకి పాల్పడ్డారు. రూ.30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి వేల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్. రెండోసారి అధికారం చేపట్టాక పాలమూరు రంగారెడ్డి పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి చుక్క నీరియ్యని దుర్మార్గుడు కేసీఆర్. రూ.80 వేల కోట్ల ప్రతిపాదనలతో రూపొందించిన పాలమూరు ప్రాజెక్టులో భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీల అంశాలే లేవు. ఇదేందని నిలదీస్తే లక్షన్నర కోట్లతో పాలమూరు - రంగారెడ్డి అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకోవాలనుకున్నారు” అని ఆరోపించారు.
పోరాడింది బీజేపీనే..
నాడు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్రం అనేకసార్లు హెచ్చరించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ తెలంగాణకు చేసిన నీళ్ల ద్రోహాన్ని ఎండగడుతూ అడుగడుగునా ఉద్యమాలు చేసింది బీజేపీనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నేను అనేకసార్లు కేసీఆర్ కు లేఖలు రాసి హెచ్చరించాను. జలశక్తి శాఖలో అడ్వయిజర్ గా ఉన్న వెదిరె శ్రీరాం తెలంగాణకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. కేసీఆర్ పట్టించుకోకపోవ డంతో.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది నేనే. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు కేంద్రం ఆహ్వానించినా వెళ్లని మూర్ఖుడు కేసీఆర్” అని మండిపడ్డారు. ‘‘నీళ్ల విషయంలో దక్షిణ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రావాలి” అని కోరారు.
