
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 29) స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ మేరకు బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు.. గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని పేర్కొన్నారు.
వరల్డ్ కప్, ఆసియా కప్ మ్యాచ్లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే రేపు జరగబోయే కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్ (ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్లు ఇవ్వడంతో పాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు.