కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 20) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది మోసం, దగా, ప్రజా వంచన బడ్జెట్ అని విమర్శించారు. అంకెల ఆర్బాటాలు.. కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేందేమీ లేదన్నారు. ఆదాయాన్ని పండబెట్టి.. అప్పుల కోసం అర్రుల చాచే బడ్జెట్ ఇదని ఎద్దేవా చేశారు. మరో రూ.లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపేందుకు సిద్ధమవ్వడం సిగ్గు చేటని విమర్శించారు.
రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ అని ఎగతాళి చేశారు. కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతు భరోసా పైసలు రెండు విడతలు ఎగ్గొట్టినట్లేనా అని ప్రశ్నించారు. రూపాయ బిళ్ల కూడా ఇవ్వకుండా కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టి కొట్టారని ధ్వజమెత్తారు. తులం బంగారం తుస్.. రూ.2500లు నిల్తో మహిళలను మళ్లీ మోసం చేశారని విమర్శించారు. రూ.4 వేల పెన్షన్ పెంపు ఊసే లేకుండా అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులున్నారనే సోయే లేదు.. బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశమే లేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు కదా.. రూపాయి బిళ్ల కేటాయించలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలకు పాడె కట్టే బడ్జెట్ ఇది అభివర్ణించారు. ఆరోగ్యశ్రీకి బడ్జెట్ కేటాయింపుల కంటే గత బకాయిలే ఎక్కువ ఉన్నాయన్నారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యాశాఖ కమిషన్ ప్రతిపాదిస్తే కేవలం 8 శాతానికే పరిమితం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేవాదాయ శాఖకు గత బడ్జెట్లో రూ.190 కోట్లు కేటాయిస్తే.. ఈసారి కేటాయింపుల ప్రస్తావనే లేదన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు కంటి తుడుపు కేటాయింపులు చేశారని విమర్శించారు. 56 శాతం ఉన్న బీసీ జనాభాకు బడ్జెట్లో 4 శాతం కేటాయింపులా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు. మైనారిటీలకు గతేడాదికంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరమన్నారు.
రూ.లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చామని ఆర్ధిక మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో వచ్చిన పెట్టుబడుల వివరాలు వెల్లడించే దమ్ముందా అని సవాల్ విసిరారు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ చేసిన అప్పుల బాగోతంపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.
