కేంద్ర పథకాలతో పేదల సంక్షేమం

కేంద్ర పథకాలతో పేదల సంక్షేమం

హైదరాబాద్, వెలుగు:ఎనిమిదేండ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం కేంద్రంలో బీజేపీ తెచ్చిన పథకాలు విజయవంతమయ్యాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. జన్ ధన్, ముద్రా యోజన, ఇంటింటికీ నల్లా తదితర ప్రయోజనాలు అర్హులందరికి అందాయని పేర్కొన్నారు. వచ్చే రెండేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్థికం, పేదల సంక్షేమం సంకల్ప తీర్మానాన్ని శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టగా.. దాన్ని పీయూష్ గోయల్ సమర్థించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కరోనా సమయంలో వ్యాక్సినేషన్, ప్రజారోగ్యం వంటి నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేశాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారమనేది ఎవరి జాగీరు కాదని.. కొందరు ఈ విషయంలో అధికారం తమకే శాశ్వతమన్న భ్రమలో ఉన్నారని అన్నారు. 

ఎగుమతులు, వృద్ధి పెరిగాయి
ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తులలో భారతదేశం 6వ స్థానంలో ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఎగుమతులు పెరిగి, వృద్ధి రేటు కూడా పెరిగిందని వివరించారు. గతంలోని విధానపర లోపాల నుంచి బయటపడి క్రమంగా రెండంకెల వృద్ధికి చేరుకుంటున్నామన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్థమయ్యాయని, భారతదేశ సుస్థిర అభివృద్ధి చూసి ప్రపంచవ్యాప్త పెట్టుబడులన్నీ ఇక్కడకు వస్తాయన్న భరోసా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలు కూడా పెంచాయి
పెట్రో ధరలు బీజేపీ ప్రభుత్వం మాత్రమే పెంచలేదు. గతంలోనూ వాటి ధరలను చాలా సార్లు పెంచారు. భారత్ త్వరలోనే మల్టీ డైమెన్షనల్ డ్రోన్ పాలసీ తీసుకురావాలని భావిస్తోందన్నారు. వ్యవసాయం, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో డ్రోన్లు కీలకంగా మారి పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ధర్మేంద్ర ప్రధాన్. వచ్చే రెండేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మా ప్రభుత్వం భావిస్తోందని.. అగ్నిపథ్ ద్వారా వృత్తి శిక్షణతోపాటు విద్యా సర్టిఫికేట్ అందిస్తారన్నారు. జీఎస్టీ వచ్చాక ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.