కరోనా ఎఫెక్ట్.. విమాన ప్రయాణాలు తగ్గవచ్చు

కరోనా ఎఫెక్ట్.. విమాన ప్రయాణాలు తగ్గవచ్చు

హైదరాబాద్, వెలుగు :  కరోనా వైరస్ వల్ల మనదేశంలో విమాన ప్రయాణాలు 10 శాతం నుంచి 15 శాతం తగ్గవచ్చని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్‌‌‌‌దీప్ సింగ్ పురి చెప్పారు. అయితే ఇండియా ఈ ఛాలెంజ్‌‌ను అధిగమిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్‌‌లో మంచి గ్రోత్ ఉందన్నారు. హైదరాబాద్‌‌ బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టులో జరుగుతోన్న ‘వింగ్స్ ఇండియా 2020’ ఎయిర్​ షోలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌‌‌‌పోర్టుల్లో సుమారు 12 లక్షల మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులను స్క్రీనింగ్‌‌ చేసినట్టు వెల్లడించారు. వీరిలో  కేవలం 3,225 మందినే టెస్ట్‌‌ల కోసం పంపినట్టు పేర్కొన్నారు. మొత్తం 30 ఎయిర్‌‌‌‌పోర్టులు ఈ స్క్రీనింగ్‌‌ చేస్తున్నాయని తెలిపారు. వేరే దేశాల నుంచి వచ్చిన 10,876 విమానాలను కూడా స్క్రీనింగ్ చేసినట్టు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఇతర దేశాల కంటే మన ఎయిర్‌‌‌‌పోర్టులు ముందంజలో ఉన్నాయని  వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వల్ల ఎయిర్‌‌లైన్ సంస్థలకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగతంగా కరోనాకు సంబంధించిన విషయాలను క్లోజ్‌‌గా మానిటర్ చేస్తున్నామని, ప్రధానమంత్రికి దీనిపై ఎప్పడికప్పుడు అప్‌‌డేట్ ఇస్తున్నట్టు వెల్లడించారు.

కేబినెట్ సెక్రటరీలు, మంత్రులు అందరూ కరోనా అరికట్టేందుకు పనిచేస్తున్నట్టు చెప్పారు.  కరోనాతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలకు దారితీయొచ్చని, ఈ గ్లోబల్ ఛాలెంజ్‌‌ను ఇండియన్ ఏవియేషన్ రంగం మరింత బలంగా మారేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉంటే.. 80 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో చాలా మంది మంచిగానే ఉన్నారు. 42 శాతం కేసులు 79 ఏళ్లు, ఆపైబడినవారివే. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా హెల్తీగానే  ఉన్నారు. చాలా మంది కోలుకున్నారు’ అని మంత్రి చెప్పారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదంటూనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

2030 నాటికి వంద కోట్ల మంది ప్యాసింజర్లు…

‘ఇండియా మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌‌ కానుంది. విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 34.5 కోట్లు ఉంటే, అది 2030 నాటికి వంద కోట్లకు  పెరగనుంది. ఎన్ని సమస్యలున్నా.. ప్యాసింజర్ ట్రాఫిక్‌‌లో డబుల్ డిజిట్ గ్రోత్ చూస్తాం. వంద కోట్ల ప్యాసింజర్ల సంఖ్యను 2024–25 నాటికే చేరుకునే అవకాశం ఉంది. ’ అని పురి అంచనా వేశారు.

ఉడాన్ స్కీమ్‌‌ ప్రమోషన్ కోసం ఎంఓయూ..

ఎయిర్‌‌‌‌ వింగ్స్ 2020 ఈవెంట్‌‌ సందర్భంగా ఉడాన్ స్కీమ్ ప్రమోషన్ కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్, స్పైస్‌‌జెట్, రాస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్ మధ్యలో మెమొరాండం ఆఫ్ అండర్‌‌‌‌స్టాండింగ్(ఎంఓయూ) కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం, ఎయిర్‌‌‌‌బస్, జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్  కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

జీఎస్టీ కిందకు ఏవియేషన్ ఫ్యూయల్‌‌‌‌….

ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ కాస్ట్‌‌‌‌లో 40 శాతం ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌‌‌‌ను (ఏటీఎఫ్‌‌‌‌) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని  మంత్రి హర్​దీప్​ పురి స్పష్టం చేశారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ కంపెనీలు కూడా ఏవియేషన్ ఫ్యూయల్‌‌‌‌ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని కోరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌గా క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటం మనకు మేలేనని అన్నారు. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి ఏవియేషన్ ఫ్యూయల్ ఛార్జీలు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ మినిస్టరీని కోరినట్టు చెప్పారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు లాభదాయకమని తెలిపారు.

సర్వీస్‌‌ హబ్‌‌గా ఇండియా

విమానాల మెయింటనెన్స్, రిపేర్‌‌ అండ్ ఓవర్‌‌‌‌హాల్‌‌(ఎంఆర్‌‌‌‌ఓ)ను పూర్తిగా ఇండియాలోనే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇండియాను సర్వీస్ హబ్‌‌గా మార్చనున్నామని చెప్పారు. ఎంఆర్‌‌‌‌ఓలపై బడ్జెట్‌‌ స్పీచ్‌‌లోనే మంత్రి నిర్మల చెప్పారని పేర్కొన్నారు. దీనిలో 100 శాతం ఇన్వెస్ట్‌‌మెంట్లను అనుమతించినట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల మెయింటనెన్స్‌‌ యాక్టివిటీలను తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. విమానాల ఎంఆర్‌‌‌‌ఓలను మన దగ్గరే చేపట్టేలా కేంద్ర చర్యలు తీసుకోవాలని ఈ ఈవెంట్‌‌ సందర్భంగా  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్‌‌‌‌ కోరారు.  సేఫ్టీ గురించి పురి మాట్లాడుతూ మూడింట రెండు వంతుల ఇంజిన్లను ఇప్పటికే రిపేర్‌‌ చేశామని, ఇంజిన్లను పెద్ద మొత్తంలో మార్చినట్టు వెల్లడించారు.

స్వచ్ఛత పక్వాడ అవార్డులు

స్వచ్ఛత పక్వాడ కింద ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులకు అవార్డులు అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం కింద అన్ని పోర్టుల్లో పూర్తిగా శానిటేషన్, క్లీన్‌‌‌‌నెస్ ప్రొగ్రామ్‌‌‌‌లను చేపడుతున్నారు. 2019 స్వచ్ఛత పక్వాడ విన్నర్లుగా ప్రైవేట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ కేటగిరీలో తొలి ప్రైజ్ విస్తారాకు వచ్చింది. రెండో ప్రైజ్ గో ఎయిర్‌‌‌‌‌‌‌‌కు, మూడో ప్రైజ్‌‌‌‌ను ఇండిగో, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఏసియాలకు ఇచ్చారు. ఇక ప్రైవేట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల కేటగిరీలో తొలి ప్రైజ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు ఇచ్చారు.  హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుతో కలిసి మూడో ప్రైజ్‌‌‌‌ను దక్కించుకుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టరీ కిందనున్న పీఎస్‌‌‌‌యూలు… ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా, పవన్ హన్స్ లిమిటెడ్, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలు కూడా స్వచ్ఛత పక్వాడ అవార్డులను అందుకున్నాయి.