కడ్తాల్ మండలంలో హై టెన్షన్ లైన్ నిర్మాణంలో.. రైతులకు నష్టం జరగకుండా చూడండి : బిహారి రత్

 కడ్తాల్ మండలంలో హై టెన్షన్  లైన్  నిర్మాణంలో.. రైతులకు నష్టం జరగకుండా చూడండి : బిహారి రత్

ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్  మండలంలో పవర్  గ్రిడ్  హై టెన్షన్  లైన్  నిర్మాణంలో రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదివారం పవర్  గ్రిడ్  కార్పొరేషన్  సీజీఎం బిపిన్  బిహారి రత్,  సీనియర్ కన్సల్టెంట్  అశోక్, డీజీఎం సతీశ్​కు బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​లో వారిని కలిసి సమస్యను వివరించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీదర్–మహేశ్వరం హై టెన్షన్  విద్యుత్  లైన్  నిర్మాణంతో కడ్తాల్  మండలంలో రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ విషయంపై నవంబర్  3న కేంద్ర విద్యుత్  శాఖ మంత్రి మనోహర్ లాల్  కట్టర్ ను కలిసి సమస్యను వివరించగా, మంత్రి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని గుర్తు చేశారు. 

తమకు నష్టం చేస్తున్న లైన్  అలైన్​మెంట్​ మార్చాలని రైతులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీజీఎం రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్  లక్ష్మీనరసింహా రెడ్డి, పీఏసీఎస్  చైర్మన్  గంప వెంకటేశ్, బాధిత రైతులు పాల్గొన్నారు.