సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరు ఇవాళ (డిసెంబర్ 1, 2025) పెళ్లి చేసుకోబోతున్నారని.. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఈ పెళ్లి జరగనుందని మీడియాలో, సోషల్ మీడియలో పుకార్లు గుప్పుమన్నాయి. ఈ పుకార్లను సమంత గానీ, రాజ్ నిడుమోరు గానీ ఖండించకపోవడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.
ఈ పుకార్లు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్న సమయంలో రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామాలీ దే నిగూడార్థంతో కూడిన ఒక పోస్ట్ తన ఇన్ స్టా స్టోరీగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. DESPERATE PEOPLE DO DESPERATE THINGS అని మైఖెల్ బ్రూక్స్ చెప్పిన మాటను ఆమె పోస్ట్ చేశారు. అంటే అర్థం ఏంటంటే.. తెగించిన వాళ్లు తెగించిన పనులే చేస్తారని ఈ కొటేషన్ అర్థం.
సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మాజీ భార్య ఈ పోస్ట్ పెట్టడంతో.. ఈ పెళ్లిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శ్యామాలీ దే పోస్ట్ చేసి ఉండొచ్చనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. 2015లో రాజ్ నిడుమోరు, శ్యామాలీ వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు.
2022లోనే ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారని సమాచారం. విడాకులు తీసుకున్నామని రాజ్ నిడుమోరు గానీ, శ్యామాలీ గానీ ఎప్పుడూ చెప్పకపోవడం గమనార్హం. రాజ్ నిడుమోరు, సమంత పెళ్లి చేసుకుంటారో లేదో పక్కనపెడితే ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారనే విషయం మాత్రం వాస్తవం. దీపావళి వేడుకలు కూడా సమంత, రాజ్ నిడుమోరు కలిసి జరుపుకున్నారు.
