వాట్సాప్ వెబ్ కొత్త అప్ డేట్.. ప్రతి 6 గంటలకు ఇలా మారిపోతుంది..!

వాట్సాప్ వెబ్ కొత్త అప్ డేట్.. ప్రతి 6 గంటలకు ఇలా మారిపోతుంది..!

దేశంలో కోట్లాది మంది యూజర్లు ప్రతిరోజూ ఉపయోగించే వాట్సాప్ వెబ్ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పును తీసుకురానుంది. ముఖ్యంగా ఆఫీసు పనుల కోసం, ఎక్కువ సేపు చాటింగ్ కోసం వాట్సాప్ వెబ్‌ను వినియోగించేవారికి కొత్త రూల్స్ పెద్ద ఇబ్బందిగా మారనుందని తెలుస్తోంది. కొత్త భారతీయ రూల్స్ ప్రకారం వాట్సాప్ వెబ్ వినియోగదారులు ఇకపై ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతారు.

6 గంటల లాగౌట్ రూల్ ఏంటి?
వాట్సాప్ వెబ్ అనేది మొబైల్‌లోని యాక్టివ్ సిమ్‌కు అనుసంధానించబడి రన్ అవుతుంటుంది. అందుకే కొత్త రూల్స్ ప్రకారం లింక్ భద్రతను ధృవీకరించడానికి, వాట్సాప్ వెబ్ సెషన్‌ను 6 గంటలకు మించి నిరంతరాయంగా కొనసాగించటానికి వీలుండదు. ప్రస్తుతం ఒకసారి లింక్ చేస్తే మొబైల్ ఆన్లైన్‌లో ఉంటే చాలు.. రోజుల తరబడి వాట్సాప్ వెబ్ నడుస్తూనే ఉంటుంది. కానీ.. కొత్త రూల్‌తో ప్రతి 6 గంటలకు లాగౌట్ అయిన తర్వాత, యూజర్ మళ్లీ మొబైల్‌లో QR కోడ్‌ను స్కాన్ చేసి రీ-లాగిన్ చేయాల్సి ఉంటుంది. నిరంతరం పనిచేసే వారికి ఇది చాలా అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. సిమ్ లేకుండా లేదా విదేశాల నుంచి మెసేజింగ్ యాప్‌లను దుర్వినియోగం చేస్తున్న నేరగాళ్లపై నిఘా పెట్టడానికి.. ప్రతి యాక్టివిటీని ఒక భౌతిక సిమ్ సబ్‌స్క్రైబర్‌కు అనుసంధానించడానికి వీలుగా కొత్త సిమ్ బైండింగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం కొంత చికాకు కలిగించినప్పటికీ మోసాలను అరికట్టడంలో దోహదపడనుంది. 

అసలు సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?
సిమ్ బైండింగ్ మార్పులకు కారణం టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన 'టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025'. ఈ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా మాధ్యమాలైన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లు పనిచేయాలంటే వాటిని సిమ్ కు లింక్ చేయటం తప్పనిసరి. దీని కింద యూజర్ తమ వాట్సాప్ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ యాక్టివ్ సిమ్ కార్డ్ తప్పనిసరిగా అదే డివైజ్‌లో ఉండాలి. సిమ్ లేకపోతే యాప్ పనిచేయదు. ఈ కొత్త రూల్స్ పాటించటానికి కంపెనీలకు 90 రోజులు సమయం అందించి మోడీ సర్కార్.