మదనాపురం, వెలుగు: రెండవ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, మదనాపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. నామినేషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న పత్రాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతి రోజు నామినేషన్లు స్వీకరించిన అనంతరం యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు.
గద్వాల: నామినేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు సూచించారు. మల్దకల్ మండలంలోని మల్దకల్- 1, మల్దకల్ -2, పెద్దపల్లి, అమరవాయి క్లస్టర్లలో నామినేషన్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. సిబ్బంది హాజరు, భద్రతాపరమైన చర్యలు, అభ్యర్థుల గుర్తింపు ధ్రువీకరణ తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారదర్శకతతో నామినేషన్ల ప్రక్రియ నిర్వహించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
