పవన్ కల్యాణ్​తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ

పవన్ కల్యాణ్​తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
  • తెలంగాణలో ఈసారీ మద్దతు ఇవ్వాలని కోరిన నేతలు
  • 2 రోజుల్లో చెప్తామన్న జనసేన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం జూబ్లీహిల్స్​లోని జనసేన ఆఫీస్​లో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్​తో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతుపై సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. పొత్తులపై రెండు రోజుల్లో నిర్ణయం చెప్తామని భేటీ తర్వాత జనసేన ప్రకటన చేసింది.

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ బుధవారం జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరారు. ఇప్పటికే 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మద్దతు తెలిపామని బీజేపీ నేతలతో పవన్ అన్నట్లు.. భేటీ తర్వాత జనసేన అధికారికంగా మీడియాకు వెల్లడించింది. 

ఈసారి మాత్రం కనీసం 30 సీట్లలో పోటీ చేయాలని జనసేన కార్యకర్తల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో పవన్ అన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్డీయేలో జనసేన భాగస్వామ్య పార్టీగా ఉండటంతో ఇప్పుడు ఆ పార్టీ ఎలా వ్యవహరించనుందనేది రాష్ట్ర రాజకీయాల్లో  ఆసక్తిగా మారింది. పవన్ తో జరిగిన భేటీ సారాంశాన్ని గురువారం ఢిల్లీలో  జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని పవన్ తో బీజేపీ నేతలు అన్నట్లు సమాచారం. 

ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చేలా  పవన్ కల్యాణ్ ను ఒప్పించడంపైనే కమల దళం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 32 స్థానాల్లో జనసేన పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. దానిపై ఆ పార్టీ యూటర్న్ తీసుకుంటుందా లేదా అనే చర్చ సాగుతోంది.