సంక్రాంతి వరకు లాక్​డౌన్​ లేదు

సంక్రాంతి వరకు లాక్​డౌన్​  లేదు
  • సంక్రాంతి తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం: కిషన్‌‌ రెడ్డి
  • దేశ ప్రజలకు లోటు ఉండొద్దనే టీకాల ఎగుమతి ఆపేసినం
  •  గాంధీ హాస్పిటల్‌‌ను సందర్శించిన కేంద్ర మంత్రి

పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు: దేశ ప్రజలకు ఎలాంటి లోటు ఉండొద్దనే అన్ని రకాల కరోనా మందులు, టీకాలను విదేశాలకు ఎగుమతి చేయడం ఆపేశామని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి అక్కడి ప్రభుత్వాలు లాక్‌‌డౌన్, ఇతర ఆంక్షలపై నిర్ణయం తీసుకోవచ్చని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఇచ్చామని తెలిపారు. సంక్రాంతి తర్వాత దేశంలో పరిస్థితులను బట్టి లాక్‌‌డౌన్‌‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదన్నారు. హైదరాబాద్‌‌ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బూస్టర్ డోసు కేంద్రాన్ని కిషన్‌‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న ట్రీట్‌‌మెంట్, ఏర్పాట్లపై సూపరింటెండెంట్ రాజారావు, ఇతర హెల్త్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటిదాకా 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు చెప్పారు. సోమవారం నుంచి దేశంలో బూస్టర్ డోసు వేయడం మొదలైందని, అర్హులైన వాళ్లు 3వ డోసును తీసుకోవాలని కోరారు.

వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ రిస్క్ తక్కువే
కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని ప్రజలను కిషన్‌‌రెడ్డి కోరారు. కరోనాకు సంబంధించిన ప్రతి అప్‌‌డేట్‌‌ను కేంద్రం ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఓ కమిటీని వేసిందని, అందులో తాను ఒక మెంబర్‌‌‌‌నని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ రిస్క్ చాలా తక్కువ అని, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు, సీనియర్ సిటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌‌ను అడ్డుకునేందుకు అవసరమైన మందులను ప్రభుత్వం తయారు చేస్తోందన్నారు.