అల్లూరి, కొమురం భీంకు  తగిన ప్రాధాన్యం దక్కలే 

అల్లూరి, కొమురం భీంకు  తగిన ప్రాధాన్యం దక్కలే 
  • రెండు ఎగ్జిబిషన్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వీరులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.1947లో దేశంలోని చాలా ప్రాంతాల్లో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయని, అయితే తెలంగాణ మాత్రం మరో ఏడాదిపాటు స్వాతంత్ర్యం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. నిజాం సైన్యం వారిని తుపాకీ గుండ్లకు బలిచేసేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు తెలంగాణలో జరిగిన వీర గాథలు, రజాకార్ల అకృత్యాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకల్ని పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలో లలిత కళా అకాడమీ, నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ (ఎన్‌‌‌‌ఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజుకు అంకితమిస్తూ, విప్లవ కారుల పేరిట ‘కథా క్రాంతి వీరోంకి’ పేరుతో షాహిది దివాస్, చంపారన్ సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్‌‌‌‌పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌‌‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాన్యుమెంట్స్ ఆఫ్‌‌‌‌ విక్టరీ అండ్ వాలోర్’ ఫొటో ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో వరంగల్‌‌‌‌లోని కాకతీయ కళాతోరణం, 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వాళ్లపై పోరాడి శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి కోట, మహ్మద్ ఖిల్జీ నేతృత్వంలో సుల్తాన్‌‌‌‌లపై సాధించిన విజయానికి గుర్తుగా ఉన్న విజయ స్థంభాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ మేఘావాల్, మీనాక్షి లేఖి పాల్గొన్నారు.   అంతకు ముందు ఢిల్లీలోని కిషన్‌‌‌‌ రెడ్డి నివాసంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో జెండా ఎగురవేశారు. 2047 వరకు దేశం కరెప్షన్ ఫ్రీ, పోవర్టీ ఫ్రీ కంట్రీగా ఎదుగుతుందని చెప్పారు.