ఆ రోజు వస్తుంది.. రానున్న రోజుల్లో రాష్ట్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం: కిషన్ రెడ్డి

ఆ రోజు వస్తుంది..  రానున్న రోజుల్లో రాష్ట్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం: కిషన్ రెడ్డి
  • చరిత్ర ప్రజలకు తెలిసేలా డిజిటల్ మ్యూజియం రూపొందించామని వెల్లడి 
  • 17న పరేడ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో కేంద్రం ఆధ్వర్యంలో వేడుకలు 
  •  గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి 

హైదరాబాద్, వెలుగు: రానున్న కాలంలో రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించే రోజు వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను ప్రజలకు సులభంగా అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ మ్యూజియం రూపొందించామని తెలిపారు. ఇందులో నిజాం పాలనలో జరిగిన దమనకాండ, విమోచన పోరాటానికి సంబంధించిన అన్ని సంఘటనలు ఉంటాయని చెప్పారు. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు నివాళి అర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం నిజాం నిరంకుశ పాలన కొనసాగింది.

 నిజాం స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించడమే కాకుండా  అవసరమైతే పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఉంటామని ఐక్యరాజ్య సమితికి లేఖలు పంపారు. ఆనాడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆర్మీ ఆపరేషన్ పోలో చేపట్టింది. చివరికి నిజాం తలవంచి లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది. నేను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అయ్యాక ప్రధాని మోదీ, అమిత్ షాతో చర్చించి.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం.

 గత రెండేండ్లు వేడుకలు నిర్వహించగా, ఇప్పుడు మూడోసారి నిర్వహించనున్నాం. ఈ నెల17న జరిగే వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ హాజరవుతారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్​రావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.