ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు? : కిషన్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు? : కిషన్ రెడ్డి
  •     రైతులకు కాంగ్రెస్​ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?: కిషన్​రెడ్డి
  •     రైతులెవరూ ఆత్మహత్మ చేసుకోవద్దని విజ్ఞప్తి
  •     బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  రైతు దీక్ష
  •     మిస్డ్ కాల్ నంబర్ ప్రకటించిన కిషన్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు నిర్లక్ష్యం ఎందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎకరానికి రూ.15 వేల రైతు బంధు, రైతుకూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం ఎటుపోయిందని అడిగారు. తెలంగాణలో చివరి ధాన్యం గింజవరకూ కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందో చెప్పాలని కోరారు. 

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ  రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ.2,200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ప్రతి బస్తాకు ఇచ్చే సుతిల్, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు.. రైతు కల్లాల నుంచి మొదలు ధాన్యం ఎఫ్ సీఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా గత బీఆర్ఎస్ సర్కారు అడ్డుకున్నదని మండిపడ్డారు. మోదీ గ్యారంటీ అంటే పక్కా అమలయ్యే గ్యారంటీ- అని, కాంగ్రెస్ గ్యారంటీ అంటే బోగస్ గ్యారంటీ అని విమర్శించారు. 

సమస్యలు తెలుసుకునేందుకు మిస్డ్​ కాల్ నంబర్​

తెలంగాణ రైతుల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మిస్డ్ కాల్ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు. రైతులు ఏ సమస్య వచ్చినా 9904 119 119  నంబర్ కు మిస్డ్​ కాల్ ఇవ్వాలని కోరారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి మోదీ, బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అర్హులు పేరు నమోదు చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ కు మిస్ట్ కాల్ ఇవ్వాలని కోరారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జి అభయ్ పాటిల్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.  రుణమాఫీ, ధాన్యానికి బోనస్, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.