
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-పట్టణ (పీఎంఏవై -అర్బన్) కింద రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అర్బన్ స్కీం కింద గతంలో 2.5 లక్షల ఇండ్లు ఇస్తే.. గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకోలేదని తెలిపారు. ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ లోని తన నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు.
ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ అమ్మను గౌరవించుకోవాలన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు అవుతున్నా.. గ్రామీణ ఇండ్ల నిర్మాణంపై కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు.
తెలంగాణకు ఇండ్ల కేటాయింపుపై ప్రతిపాదన రాలేదని కేంద్ర అధికారులు చెబుతున్న విషయాన్ని మంత్రులకు వివరించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ లో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తెలంగాణ నుంచి ప్రతిపాదనలు రాలేదని, అందువల్ల ఆ ప్రతిపాదనలు రాగానే రాష్ట్రానికి ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశానని అన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పీఎం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే ఆలోచన చేద్దామని అన్నట్టు తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టులో గోడ కూలడంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ విలీనంపై ఎలాంటి సంప్రదింపుల్లేవు..
బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటి వరకు తమ పార్టీలో ఎలాంటి సంప్రదింపులు లేవని కిషన్రెడ్డి వెల్లడించారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీడియాకే చెప్తామని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు అన్ని విధాలుగా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.