మెట్రోను సర్కారు స్వాధీనం చేసుకుంటేనే..రెండో దశకు మోక్షం! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మెట్రోను సర్కారు స్వాధీనం చేసుకుంటేనే..రెండో దశకు మోక్షం! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
  • ఆ  ప్రాసెస్ పూర్తయ్యేదాకా కేంద్రం నుంచి ఎలాంటి చర్యలుండవని స్పష్టీకరణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటేనే రెండో దశ పనులకు మోక్షం కలుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో రెండో దశపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌‌‌‌‌తో తాను చర్చించానని లేఖలో పేర్కొన్నారు. మెట్రో ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌ను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

ఈ స్వాధీన ప్రక్రియకు సంబంధించిన అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలు పూర్తిగా కొలిక్కి వస్తేనే.. రెండో దశ నిర్మాణంపై కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి వివరించారు. ఈ ప్రాసెస్ పూర్తయితేనే రెండో దశకు కేంద్రం సహకారం ఉంటుందన్నారు.  మెట్రో రెండో దశ సన్నాహాల కోసం కేంద్రం, రాష్ట్రం నుంచి అధికారులతో ఒక జాయింట్​కమిటీ వేయాలని నిర్ణయించిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. ‘‘కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో కమిటీ వేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు ఆఫీసర్ల పేర్లు పంపాలని కేంద్రం కోరింది. కానీ, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పేర్లను ప్రతిపాదించలేదు’’ అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.