అమెరికాకే 35 శాతం ఫార్మా ఎగుమతులు: కిషన్ రెడ్డి

అమెరికాకే 35 శాతం ఫార్మా ఎగుమతులు:  కిషన్ రెడ్డి
  • ప్రపంచ వ్యాప్తంగా ఫుల్​ డిమాండ్
  • ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
  • టాప్ 5 కమోడిటీ ఎక్స్​పోర్ట్​లో ఔషధాలున్నయ్
  • 73వ ఇండియన్ ఫార్మా కాంగ్రెస్​లో కేంద్ర మంత్రి కామెంట్

హైదరాబాద్, వెలుగు: దేశం నుంచి ఎగుమతయ్యే టాప్ 5 కమోడిటీల్లో ఔషధాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరుడు మొత్తంగా రూ.1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎక్స్​పోర్ట్ చేశామని తెలిపారు. వీటిలో రూ.67 వేల కోట్ల (35శాతం) విలువైన మెడిసిన్స్ ఒక్క అమెరికాకే పంపించామని చెప్పారు. ఇండియాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులు ఎంత నాణ్యమైనవో ఈ ఎగుమతుల ద్వారానే అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఆదివారం జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కరోనా టైమ్​లో ఇండియా వ్యాక్సిన్లను తయారు చేసింది. ప్రపంచ దేశాలకు అందజేసింది. 7.5 కోట్ల డోసులను 94 దేశాలకు, ఐక్యరాజ్య సమితికి చెందిన రెండు సంస్థలకూ వ్యాక్సిన్ సప్లై చేసి విశ్వబంధుగా నిలిచింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫార్మా పరిశ్రమకు మద్దతు ఎంతో అవసరం’’అని అన్నారు. 

మౌలిక వసతులు అవసరం

ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందాలంటే మెరుగైన మౌలిక వసతులు అవసరమని కిషన్ రెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం... మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నది. ‘‘2027 నాటికి ఇండియాను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న సకల్పంతో పీఎం గతి శక్తి ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దీని ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధాని మోదీ పని చేస్తున్నారు. ఇండియాలో 74 ఆపరేషనల్ ఎయిర్​పోర్టులు ఉన్నాయి. 2014 తర్వాత రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులు 500 శాతం పెరిగాయి. 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌014కు ముందు హైవే నెట్​వర్క్ 91,287 కిలో మీటర్లు ఉంటే.. ఇప్పుడు లక్షన్నర కిలో మీటర్లకు పెరిగింది. 

రైల్వే శాఖ దాదాపు 3వేల కిలో మీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మాణం తలపెట్టింది. 2013–14లో మన దేశం విద్యుత్ డిమాండ్ 136 గిగా వాట్స్ ఉండేది. 2023 నాటికి 244 గిగా వాట్లకు పెరిగింది’’అని అన్నారు. ఫార్మా ఇండస్ట్రీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లకు గ్యారంటీ ఉంటుందని తెలిపారు. రాబోయే బల్క్ డ్రగ్ పార్క్​లో కామన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్​ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. ఇండియన్ ఫార్మా సెక్టార్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను అందుకునేలా ఫార్మాస్యూటికల్ అప్​గ్రెడేషన్ అసిస్టెన్స్ స్కీమ్​ను అందిస్తున్నామన్నారు. దేశంలో ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.