తెలంగాణలో కక్ష్య పూరిత రాజకీయం

తెలంగాణలో కక్ష్య పూరిత రాజకీయం

తెలంగాణ రాష్ట్రంలో కక్ష్య పూరిత రాజకీయం నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, సోషల్ మీడియా జర్నలిస్టులపై నిర్బంధం పెట్టారని మండిపడ్డారు. పోలీసులు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, లిక్కర్, బియ్యం మాఫియా రాష్ర్టంలో పని చేస్తోందన్నారు. ఇటీవల మైన్స్ మాఫియా కూడా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామో లేదో అనే ఉద్దేశంతో టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ తరహా వ్యవహారం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తోందన్నారు. 

ఖమ్మంలో బీజేపీ సాధారణ కార్యకర్త సాయి గణేష్ పై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ నేతల ప్రొద్బలంతో పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సాయి గణేష్ సూసైడ్ చేసుకోవడానికి కారకులు ఎవరో చనిపోయే ముందు అతడు వాంగ్మూలం ఇచ్చినా.. వారిపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఆత్మహత్యాయత్నం చేయడం నేరమంటూ సాయి గణేష్పైనే పోలీసులు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే బీజేపీ అడ్డుకోలేదని, హైదరాబాద్ లో తమ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తే మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారం టీఆర్ ఎస్ ప్రతిరోజూ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో గజ్వేల్ నియోజకవర్గానికి, దుబ్బాక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల హైదరాబాద్ ప్రజలు డ్రైనేజీ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో దళిత విద్యార్థులకు కేంద్రం స్కాలర్ షిప్పులు ఇవ్వకుండా  రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. 
 
లక్షకోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు 10 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణాలకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పంజాబ్ లో రైతులు చనిపోతే ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన అమరవీరులకు మాత్రం పూర్థిస్తాయిలో ఆర్థిక సాయం అందించడం లేదన్నారు. పథకం ప్రకారం సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్ర మంత్రులతో కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, చమురు ధరలు ఎంత పెరిగితే వాటిపై తెలంగాణ ప్రభుత్వం అదే లెక్కన పన్ను వసూలు చేస్తోందన్నారు. యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ రైలు వేయడం కోసం సహకారం అందించమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం అఫ్జల్ గంజ్ లో ఎందుకు అగిపోయిందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అభద్రతా భావంతో ఉందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

పాక్ డిగ్రీలు చెల్లవ్

మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె