ఏడాదంతా విమోచన వేడుకలు

 ఏడాదంతా విమోచన వేడుకలు

కమలాపూర్, స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్ (చిల్పూరు), వెలుగు: రజాకార్లు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులకు చరిత్ర పుటల్లో సరైన స్థానం దక్కలేదని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. యావత్​ ప్రపంచానికి తెలిసేలా తెలంగాణ విమోచన వేడుకలు జరుగుతాయని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు చేసిన వీరోచిత పోరాటం, వేలాది మంది బలిదానాల చరిత్ర యువ తరానికి తెలియజెబుతూ అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. శనివారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య సంస్మరణ సభకు కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. ఈటల మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈటల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబర్​ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 దాకా ఏడాదంతా రాజకీయాలకు అతీతంగా వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు. నాడు నిజాం రాజ్యానికి వేదికైన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేడుకలను జరుపుతామన్నారు. మూడు రాష్ర్టాల సీఎంలు రానున్నారని, వారికి ఇప్పటికే ఆహ్వానం పంపామని 
తెలిపారు.

ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్:  తరుణ్ చుగ్
టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను తమ పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌‌‌‌‌చుగ్ తెలిపారు. ఆ రోజున అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఈటల మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమిత్ షా పంపిన లేఖను ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేసి సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫోన్‌‌‌‌‌‌‌‌లో ఈటల కుటుంబాన్ని పరామర్శించారు.

ఎస్సీ మోర్చా నాయకుడి ఇంట్లో తేనీటి విందుకు తరుణ్‌‌‌‌‌‌‌‌చుగ్
బీహార్, బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలకు చక్కర్లు కొడుతూ తిరగడం కాకుండా తెలంగాణ కోసం పని చేయాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ తరుణ్​చుగ్ హితవు పలికారు. సీఎం కేసీఆర్ రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో ఉన్నారని, కేసీఆర్ విముక్త రాష్ట్రం రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈటల కుటుంబాన్ని పరామర్శించి హైదరాబాద్ వెళ్తూ మార్గం మధ్యలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో తరుణ్‌‌‌‌‌‌‌‌ చుగ్ పర్యటించారు. చిన్నపెండ్యాలకు చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బానాల శ్రీనివాస్ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. అక్కడ ఆయన 10 నిమిషాలు గడిపారు. శ్రీనివాస్ అత్త, మామలు కర్ణకంటి కతాలు, శాంతమ్మలను తరుణ్​చుగ్ శాలువాతో సన్మానించారు. వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి తదితరులు    ఉన్నారు. 

విమోచన దినోత్సవానికి రండి:కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ
న్యూఢిల్లీ, వెలుగు:  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో కేంద్రం  నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. 1948, సెప్టెంబర్17న స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ గడ్డపై విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా17న హైదరాబాద్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకూ తెలంగాణ విమోచన వజ్రోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.