ఎవరూ నా సహకారం కోరలేదు

ఎవరూ నా సహకారం కోరలేదు

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో తన సహకారం కావాలని ఎవరూ కోరలేదని, తనకు ఆ రకమైన ఫోన్లు ఎవరూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది ఆయన భార్య హెల్త్ చెకప్‌ కోసమేనని అన్నారు. కేంద్ర నిధులతో హైదరాబాద్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పాత బస్తీ వరకూ మెట్రో రైలు సేవలను పొడిగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు ట్రైబల్ మ్యూజియాన్ని కూడా కేంద్రం ఇచ్చిందని ఆయన అన్నారు.

యాసంగిలో తెలంగాణ రైతులెవరూ వరి పంట వేయొద్దని, ఒక వేసినా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోదని రాష్ట్ర సర్కారు కొన్ని రోజులగా ప్రకటనలు చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనాల్సిందేనంటూ బీజేపీ నేతలు నిరసనలకు దిగిన నేపథ్యంలో దీనికి కౌంటర్‌‌గా టీఆర్‌‌ఎస్ నిరసనలకు దిగింది. కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లన్నీ కొనుగోలు చేయాలంటూ సీఎం కేసీఆర్ సైతం ధర్నా చౌక్‌లో నిరసనకు దిగారు. ఆ తర్వాత కేంద్రం మెడలు వంచుతానని చెప్పి.. ఢిల్లీ వెళ్లిన ఆయన మూడ్రోజుల తర్వాత నిన్న తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రితో గానీ భేటీ కాకుండా, ఢిల్లీలో ఎటువంటి నిరసనలు గానీ చేయకుండానే ఆయన హైదరాబాద్‌కు చేరుకోవడంతో కిషన్‌ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌‌ది వ్యక్తిగత పర్యటననే అంటూ కామెంట్ చేశారు.