కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్లు.. ఉంటదో, ఉండదో.. ఆరు గ్యారంటీలు ఏమైనయ్?: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్లు.. ఉంటదో, ఉండదో.. ఆరు గ్యారంటీలు ఏమైనయ్?: కిషన్ రెడ్డి
  • ఫ్రీ జర్నీ కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా?
  • ప్రజలు, రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణ
  • చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్లతో భేటీ

చేవెళ్ల, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉంటదో.. ఉండదో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సందర్భంగా రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగు నెలలు దాటినా.. ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని మండిపడ్డారు. 

హామీల అమలుపై ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నారు. రైతులు, ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ఓటర్లకు వివరించాలని బూత్ స్థాయి కేడర్​కు సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సోమవారం హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్​లోని జేపీఎల్ కన్వెన్షన్​లో హాల్​లో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

‘‘రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ హామీ ఏమైంది? ఎకరానికి రూ.15వేలు ఇస్తామన్న రైతు భరోసా ఏమైంది? అని రైతులందరూ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీయాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే అన్ని గ్యారంటీలు అమలైనట్టేనా?’’అని మండిపడ్డారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తేనే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి చెందుతుందన్నారు.

అనంతగిరిని పర్యాటక కేంద్రంగా మారుస్తాం

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలను పర్యాటక కేంద్రంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. ‘‘చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గుడి భూములు మింగి అపార్ట్​మెంట్లు కడ్తున్నడు. అలాంటి వారికి ఓటేస్తే నియోజకవర్గంలోని ఆలయ భూములు అన్నీ మింగేస్తడు. మేము త్రిపుల్ తలాక్​ను రద్దు చేశాం. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ త్రిపుల్ తలాక్ తీసుకొస్తామని రాహుల్ గాంధీ అంటున్నడు. మేనిఫెస్టో పెట్టడమే తప్ప.. వాటిని అమలు చేయడం కాంగ్రెస్​కు చేతకాదు. ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ ఇస్తామని అన్నరు. ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వంద రోజులు దాటినా.. రుణ మాఫీ చేయలేదు’’అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.

జూన్ తర్వాత లక్ష మందితో సభ నిర్వహిస్తం

నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని, జూన్ తర్వాత లక్ష మందితో వికారాబాద్​లో సభ నిర్వహిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో విదేశీ వస్తువులు ప్రోత్సహించి.. దేశానికి అన్యాయం చేసిందన్నారు. ‘బీజేపీ పాలనలో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాం. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు గుర్తుకొస్తయ్. ఓటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుంది’’అని అన్నారు. చేవెళ్లలో మూడు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలవబోతున్నదని ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ‘‘చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఇప్పటి దాకా 5వేల మంది నేతలు బీజేపీలో చేరారు. బీజేపీకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు అంటున్నరు. కేంద్రంలో వచ్చేది మళ్లీ మోదీ ప్రభుత్వమే’’అని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మల్లారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.