కిషన్ రెడ్డి సీరియస్.. వారిద్దరూ పరుగులు

కిషన్ రెడ్డి సీరియస్..  వారిద్దరూ పరుగులు

మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కొందరు అధికారులు షాక్ ఇచ్చారు. కేంద్ర మంత్రి సమావేశానికి రాకుండా డుమ్మాకొట్టారు. కిషన్ రెడ్డి  పెట్టిన మీటింగ్ కు  కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ గైర్హజరయ్యారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో నిర్వహిస్తున్న దిశ కమిటీ మీటింగ్ కు వీళ్లిద్దరూ రాలేదు. దీంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీ నిర్లక్ష్య లెక్కచేయని తీరును ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని మండి పడ్డారు. గంటలో మీటింగ్ కు రాకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని మిగతా అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో..  వెంటనే కలెక్టర్, కమిషనర్ పరుగులు తీస్తూ సమావేశానికి వచ్చారు. 

హైదరాబాద్ లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమావేశంలో కిషన్ రెడ్డి చర్చించారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 20కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఇతర దేశాలు భారత్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. బస్తీ దావాఖానాలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు కిషన్ రెడ్డి. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. స్వనిది యోజన పథకం హైదరాబాద్ లో అధికారులు బాగా అమలు చేశారని ప్రశంసించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఆలస్యమవుతుందన్నారు. మరోవైపు ఈ సమావేశంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దిశ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.