సాగర్ నీళ్లు : పోలింగ్ టైంలో బీఆర్ఎస్, వైసీపీ డ్రామా: కిషన్ రెడ్డి

సాగర్ నీళ్లు :   పోలింగ్ టైంలో బీఆర్ఎస్, వైసీపీ డ్రామా: కిషన్ రెడ్డి
  • సాగర్ నీళ్లను ఏపీకి తరలించడం సరికాదు
  • దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడి   

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా కనిపించిందని, రాష్ట్రంలోని యువత బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు. తమకు ఎన్ని సీట్లు వస్తాయనేది డిసెంబర్ 3న చూస్తారన్నారు. 

గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పోలీసులు కేసీఆర్ కనుసన్నల్లో పనిచేశారని, బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుంటే చూస్తూ ఉండి పోయారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బులు, మద్యం పంచాయన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ భౌతిక దాడులకు పాల్పడిందన్నారు.

 దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు. గురువారం నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనను కిషన్ రెడ్డి ఖండించారు. ఏపీ ప్రభుత్వం సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు తరలించుకుపోవడం సరికాదన్నారు. పోలింగ్ ప్రారంభమైన టైంలో బీఆర్ఎస్, వైసీపీ కలిసి  ఆడిన డ్రామా ఇది అని ఫైర్ అయ్యారు. సాగర్ నీళ్ల సమస్యను కేఆర్ఎంబీ ద్వారానే పరిష్కరించుకోవాలని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.