పేపర్ లీకేజీలో పెద్దల హస్తం: కిషన్ రెడ్డి

పేపర్ లీకేజీలో పెద్దల హస్తం: కిషన్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీ వెనకాల పెద్దల హస్తం ఉందని.. దీనిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్టైన బీజేవైయం (BJYM)  నేతలను మార్చి 26న కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి చంచల్ గూడా జైలుకు వెళ్లి పరామర్శించారు. పేపర్ లీకేజీతో తెలంగాణలో ఉన్న యువత అంతా ఉక్రోషంతో ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ ప్రభుత్వ చేతగాని తనమని కిషన్ రెడ్డి విమర్శించారు. అవినీతిని,అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వితండవాదం చేస్తుందని తమ పొరపాటును ఒప్పుకోవడం లేదని అన్నారు.

అన్ని రకాలుగా, అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత స్పందిస్తున్నారని, ప్రజలు రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కుటుంబ, అవినీతి, అక్రమ, మాఫియా పాలన పోవాలని తెలంగాణ సమాజం కోరుకుంటుదని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందన్నారు. బీజేపీ పార్టీకి జైళ్లు కొత్త కాదని, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి పేర్కొ్న్నారు.