రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టుతో రాజకీయాలా? : కిషన్ రెడ్డి

రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టుతో రాజకీయాలా? : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి మేలుచేసే ప్రాజెక్టుతో రాజకీయాలు వద్దని, రాష్ట్ర పురోగతి కోసం రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్​ఎఫ్​సీఎల్) ప్రారంభోత్సవానికి  హాజరుకావాలని సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో పట్టువిడుపులు సహజమని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం తన హుందాతనాన్ని నిలుపుకోవాలని హితవు పలికారు. ప్రధాని పార్టీ కార్యక్రమానికి వస్తుంటే నిరసన తెలిపినా అర్థం ఉంటుందని, తెలంగాణ పురోగతికి సంబంధించిన ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తుంటే ఉత్సాహంగా పాల్గొనాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసినపుడే పురోగతి సాధ్యమవుతుందని ఆయన  పేర్కొన్నారు. కేసీఆర్ ఘర్షణాత్మక వ్యవహారశైలితో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని అన్నారు.  ప్రధాని టూర్​ను అడ్డుకోవాలని  కమ్యూనిస్టులను, కొన్ని సంఘాలను టీఆర్ఎస్ రెచ్చగొడుతోందని ఆరోపించారు. తమ అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్న కేసీఆర్​తో వామపక్షాలు అంటకాగడం  సరికాదన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపడుతున్న ప్రోగ్రాంలకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. 

ఆర్​ఎఫ్​సీఎల్​తో తెలంగాణ ముఖ చిత్రమే మారుతది...
ఆర్​ఎఫ్​సీఎల్ తో తెలంగాణ ముఖ చిత్రమే మారుతదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీతో రాష్ట్ర  యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రైతులకు యూరియా పెద్ద మొత్తంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలాంటి ఫ్యాక్టరీ అంశంలో  టీఆర్ఎస్, వారి మిత్ర పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణతోపాటు, దేశంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. ‘మా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. చేయాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణకు సింగరేణి సంస్థలో.. కేంద్రం వాటా 49%, రాష్ట్రం వాటా 51%. రాష్ట్రానికే మెజారిటీ షేర్ ఉన్నప్పుడు మేమెలా ప్రైవేటు పరం చేస్తాం. కానీ, ఇవాళ సింగరేణి బొగ్గు గనుల వద్ద.. సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దంటూ బోర్డులు పెట్టి ప్రజల్లో, కార్మికుల్లో అనవసర అనుమానాలకు తావిస్తున్నారు’ అని మండిపడ్డారు. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు.  రాజకీయాల్లో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు సహజమని.. కానీ, దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం  వాటిని పక్కనపెట్టి పనిచేయాల్సి ఉంటుందన్నారు. 

ప్రొటోకాల్ పాటించనిది ఎవరు...
రాష్ట్రానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించని విషయం వాస్తవమా? కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.