బొగ్గు ఉత్పత్తి, రెవెన్యూలో రాజీ పడొద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 బొగ్గు ఉత్పత్తి, రెవెన్యూలో రాజీ పడొద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • ప్రత్యేక కార్యాచరణతో  లక్ష్యాన్ని సాధించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని.. ఈసారి అంతకు మించిన ప్రగతిని సాధించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలలు మిగిలి ఉన్నందున.. ప్రత్యేక కార్యాచరణతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని ఆ శాఖ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఢిల్లీలోని అశోక హోటల్ లో జరిగిన కోల్ పీఎస్‌‌‌‌యూల అర్ధవార్షిక సమీక్ష సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 

‘ఈసారి వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీన్ని అర్థం చేసుకోగలం. కానీ, తర్వాత పుంజుకుని ఉత్పత్తిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దీనిపై అన్ని సబ్సిడరీల సీఎండీలు చొరవతీసుకోవాలి. ఏడాదికేడాది ఉత్పత్తి, రెవెన్యూ విషయంలో పురోగతి సాధించాలి. ఈ విషయంలో రాజీ పడొద్దు’’ అని కిషన్​రెడ్డి సూచించారు. వచ్చే మూడున్నరేండ్లపాటు కేంద్ర ప్రభుత్వ సంస్కరణల ఆధారంగానే నడవాలని స్పష్టం చేశారు.  

పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తా..

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఫైనల్ పరీక్ష ఫీజు తానే చెల్లిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనకు ఆయన లేఖ రాశారు. ఈ విషయాన్ని గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రధాని మోదీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు నా వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న టెన్త్​ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు మొత్తాన్ని నా జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించాను’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.