హమాస్​పై ప్రశ్నకు నేను జవాబివ్వలే ..ఆ డాక్యుమెంట్ ఫేక్: మీనాక్షి లేఖి

హమాస్​పై ప్రశ్నకు నేను జవాబివ్వలే ..ఆ డాక్యుమెంట్ ఫేక్:  మీనాక్షి లేఖి

న్యూఢిల్లీ: పాలస్తీనాకు చెందిన హమాస్​ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​గా ప్రకటించడానికి సంబంధించిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ నిజమైనది కాదని విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖి స్పష్టం చేశారు. హమాస్​ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​గా భారత్ ప్రకటించడంపై ప్రపోజల్ ఉందా? అంటూ కేరళ కాంగ్రెస్ ఎంపీ కుంబకూడి సుధాకరన్ లోక్ సభకు రాతపూర్వకంగా ప్రశ్న పంపగా.. తాను సమాధానం ఇచ్చినట్లుగా ఓ డాక్యుమెంట్ సర్క్యులేట్ అవుతోందని ఆమె శనివారం ట్వీట్ చేశారు. ఒక సంస్థను టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించినప్పుడు ఉపా చట్టం కింద చర్యలు వర్తిస్తాయని తాను సమాధానం ఇచ్చినట్లుగా ఉందన్నారు. 

అయితే, లోక్ సభలో ఆ క్వశ్చన్ నెంబర్ 980కి సంబంధించి తాను ఎలాంటి పేపర్​పై సంతకం చేయలేదన్నారు. లోక్ సభ, విదేశాంగ శాఖ వెబ్ సైట్లలోకి ఈ డాక్యుమెంట్ ఎలా అప్ లోడ్ అయిందన్న దానిపై విచారణ చేయిస్తామని, దీనికి బాధ్యులు ఎవరో తేలుస్తామన్నారు. ఈ డాక్యుమెంట్ పై ఎంక్వైరీ చేయిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా వెల్లడించారు. కాగా, మీనాక్షి లేఖి సంతకం ఫోర్జరీ జరిగితే గనక ఇది తీవ్రమైన విషయమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. దీనిపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆ డాక్యుమెంట్ ను ఆమె ఆమోదించారా? లేదా? అన్నది కూడా తేల్చాలని కోరారు.