వివిధ రాష్ట్రాల గనుల శాఖల మంత్రులతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

వివిధ రాష్ట్రాల గనుల శాఖల మంత్రులతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

హైదరాబాద్‌, వెలుగు: మైనింగ్​ రంగాన్ని మరింత డెవలప్​ చేద్దామని కేంద్ర గనుల  శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. మైనింగ్‌ రంగ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని, ఖనిజాల అన్వేషణ, వాటిని వేలం వేయడంలో రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జీడీపీలో మైనింగ్​ రంగం వాటా 0.9% ఉందని, 2030 నాటికి ఈ వాటాను 2.5 శాతానికి పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ లో వివిధ రాష్ట్రాల గనుల శాఖల మంత్రుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ద మైనింగ్ ఎరీనా’ అనే డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించి మాట్లాడారు.

ఫెడరల్‌ స్ఫూర్తితో రాష్ట్రాలన్నింటినీ భాగస్వామ్యం చేస్తున్నామని, గనుల మంత్రులను, అధికారులను ఆహ్వానించి సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇండియా ఇప్పటికే బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద ఎకానమీగా ఎదిగిందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మైనింగ్​ పాలసీల్లో నూతన సంస్కరణలను తెచ్చింది. గతంలో మైనింగ్‌ అనుమతుల్లో 49 నిబంధనలు ఉంటే వాటిని 24కు తగ్గించినం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌  ద్వారా మినరల్‌ బ్లాక్‌ల అన్వేషణలో ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించి పెట్టుబడులకు అవకాశం కల్పించడం, బ్లాక్‌ల వేలాన్ని  సులభతరం చేయడంతో ఈ రంగంలో పోటీ బాగా పెరిగింది. ఫలితంగా రూ.90 వేల కోట్ల ఆదాయం వచ్చింది” అని మంత్రి చెప్పారు. దేశీయ బొగ్గు  ఉత్పత్తి 2014లో 572 మిలియన్‌ టన్నులు ఉంటే.. నేడది 800 మిలియన్‌ టన్నులకు పెరిగిందన్నారు. సదస్సులో కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, గుజరాత్‌ రాష్ట్రాల గనుల శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున సింగరేణి సీఎండీ శ్రీధర్‌, సింగరేణి డైరెక్టర్‌  హాజరయ్యారు.