- మహిళలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ మహిళలను నిలువునా మోసం చేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, రెండేళ్లు దాటినా నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు.
అలాగే ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి నిధులు కేటాయించకుండా, మద్యం ఏరులై పారిస్తూ మహిళల తాళిబొట్లు తెగుతున్నా పట్టించుకోవడం లేదని, బెల్టు షాపుల నిర్మూలన వాగ్దానాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. మహిళా దినోత్సవం నాడు పత్రికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తే సరిపోదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
