రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది

రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది

మహబూబాబాద్: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ లో జరిగిన బీజేపీ లోక్ సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పంట నష్టపోవడం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న మంత్రి... ఫసల్ బీమాను అమలు చేయకుండా కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. ఫ్రీ రేషన్ ద్వారా దేశంలోని పేదలందరి ఆహార భద్రత ను కల్పించిందని, రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం నేరుగా లబ్దిదారులకు చేరుతోందని, దీనికి జన్ ధన్ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నాయని స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం దృఢంగా పనిచేస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో రూ.4 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న మంత్రి... అవినీతి రహిత పాలనే ధ్యేయంగా మోడీ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ప్రధాని మోడీ తీసుకున్న చర్యలు అమోఘమని, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 200 డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆయన్ను సాగనంపడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలను కోరారు.