గొర్రెల స్కామ్​పై విచారణ చేస్తం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటం

గొర్రెల స్కామ్​పై విచారణ చేస్తం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటం

ఎల్​బీనగర్, వెలుగు: గొర్రెల స్కీమ్ లో స్కామ్ పై విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. ‘‘గొర్రెల స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఈ పథకంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటం” అని చెప్పారు. శనివారం నాగోల్ లోని ఓ గార్డెన్ లో జరిగిన ‘విజయ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో రూపాల పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో బీజేపీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడంతో పార్టీకి నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా చూస్తున్నామని తెలిపారు. కార్యకర్తల్లో మనోబలం నింపడానికి విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ‘‘రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. నేను 40 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. గతంలో మేం సమస్యలపై దృష్టి పెట్టేవాళ్లం. ఇప్పుడున్న రాజకీయాల్లో అవినీతి డబ్బులతో గెలవాలని చూస్తున్నారు” అని అన్నారు. 

మోదీ హయాంలో దేశాభివృద్ధి.. 

ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రూపాల అన్నారు. ‘‘2014కు ముందు భారత ఆర్థిక వ్యవస్థ 20వ స్థానంలో ఉండేది. మోదీ పదేండ్ల  పాలనలో 5వ స్థానానికి వచ్చింది. ఆయన ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి ఎదుగుతుంది. మోదీ అయోధ్యలో రామమందిరం నిర్మించారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. కరోనా టైమ్ లో చిన్న దేశాలకు సహాయం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికి ఆపద వచ్చినా సహాయం చేయడానికి మన దేశం ముందుంటుంది. అందుకే ఈరోజు మన దేశాన్ని విశ్వగురువుగా పరిగణిస్తున్నారు” అని పేర్కొన్నారు. ‘‘2014కు ముందు మన జాతీయ బ్యాంకులు రూ.2 లక్షల కోట్ల నష్టాల్లో ఉండేవి. మోదీ వచ్చిన తర్వాత లక్ష కోట్ల లాభాల్లో ఉన్నాయి. మోదీ వచ్చాక మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.38 వేల కోట్లు ఖర్చు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మోదీ అభివృద్ధి చేస్తున్నారు” అని అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర శనివారం సంగారెడ్డి, దౌల్తాబాద్ నర్సాపూర్ ప్రాంతాల్లో కొనసాగింది. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల, మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.