ఇలాంటి మొబైల్ గేమ్స్.. ఇండియాలో బ్యాన్

ఇలాంటి మొబైల్ గేమ్స్.. ఇండియాలో బ్యాన్

దేశంలో మూడు రకాల ఆటలను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. అందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని ఆయన ఏఎన్‌ఐకి తెలిపారు. బెట్టింగ్‌తో కూడిన గేమ్స్, వినియోగదారుకు హాని కలిగించేవి, వ్యాసనపరులుగా మార్చే గేమ్స్.. ఇలా నిషేధించిన వాటిని మూడురకాల కేటగిరీలుగా విభజించారు. ఆటలలో ఈ కేటగిరీలు ఏవైనా కనిపిస్తే అవి నిషేధానికి గురవుతాయని వెల్లడించారు. 

మంత్రి మాట్లాడుతూ.."దేశంలో మొదటిసారిగా ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చాము. దేశంలో 3 రకాల గేమ్‌లను నిషేధించాం. వీటిని ఎట్టి పరిస్థితులల్లోనూ అనుమతించము. బెట్టింగ్‌లతో కూడినవి, వినియోగదారుకు హాని కలిగించే ఆటలు మరియు వ్యసనానికి సంబంధించిన అంశాలు నిషేధించబదిన వాటిలో ఉన్నాయి.." అని కేంద్ర మంత్రి తెలిపారు. 

ఇటీవల ఘజియాబాద్ పోలీసులు ఆన్‌లైన్ గేమ్‌లను ఉపయోగించి యువకులను చట్టవిరుద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న రాకెట్‌ను  ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ గేమ్‌లపై కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.