వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్
కేసీఆర్ తన గొయ్యి తానే తొవ్వుకుంటుండు: కిషన్ రెడ్డి
బీజేపీలో చేరిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలన త్వరలోనే ఖతమైతుందని.. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ కేంద్ర, రాష్ట్ర నేతల సమక్షంలో తెలంగాణ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సభ్యత్వం అందించి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ బీజేపీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్బానంద మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతమొందించాలని ప్రజలు నిశ్చయించుకున్నారని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో 2047 కల్లా దేశంలో ఆత్మ నిర్బర్ భారత్​గా మారుతుందన్నారు. ఇందులో భాగం అయ్యేందుకు పెద్ద మనసుతో శశిధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శశిధర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు లోపాయకారీ ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. ఏ చిన్న సందు దొరికినా కేసీఆర్ సెంటిమెంట్లు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, రాక్షస పాలన సాగుతుందని మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్,​ ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఫినిష్: మర్రి శశిధర్​రెడ్డి

కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆల్ మోస్ట్ కాంగ్రెస్ ఫినిష్ అయిందన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తూ.. చాలా ఆలోచించిన తర్వాతే బీజేపీలో చేరేందుకు నిశ్చయించుకున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రక్రియలో తను కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. టీఆర్ఎస్​ను గద్దె దించడానికి ఒక సామాన్య కార్యకర్తగా పోరాడుతానన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటయ్యేందుకు అవసరమైతే తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్​కు ఫ్యామిలీ ఫస్ట్.. బీజేపీకి తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ అని శశిధర్​రెడ్డి చెప్పారు. 

అభద్రతాభావంలో కేసీఆర్ : కిషన్ రెడ్డి

అభద్రతాభావంలో ఉన్న కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. రాజకీయ సంక్షోభం తీసుకురావాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ.. రాష్ట్ర ప్రజల గురించి మర్చిపోయారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ మార్పు బీజేపీతోనే సాధ్యం అని నమ్ముతున్నారన్నారు. ప్రజలు బానిసలుగా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటుందని చెప్పారు. అందువల్లే కేంద్రం, బీజేపీపై అనేక రకాలుగా బురద చల్లాలని ప్రయత్నిస్తుందన్నారు. ఇలాంటి వాటికి బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిజాయితీపరుడిగా, మచ్చలేని మనిషిగా మర్రి శశిధర్ రెడ్డికి పేరుందన్నారు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరడం పార్టీకి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్నారు.