కేంద్ర పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ సర్కార్ అమలు

కేంద్ర పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ సర్కార్ అమలు
  • కామారెడ్డి కలెక్టర్ ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి నిర్మల..  తెలియదన్న కలెక్టర్.. మంత్రి ఫైర్ 
  • కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తున్నా ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదని నిలదీత  
  • కేంద్ర పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తోందని ఆగ్రహం

కామారెడ్డి / బాన్సువాడ / నిజామాబాద్, వెలుగు: ప్రజలకు ఇస్తున్న రేషన్ లో కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా చెల్లిస్తున్నాయని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్​ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రశ్నించారు. తనకు సరిగా తెలియదని కలెక్టర్ జవాబు చెప్పడంతో.. ‘‘మీరు ఐఏఎస్​ ఆఫీసర్ కదా. ఇది కూడా తెలియదా? స్పష్టంగా తెలుసుకొని చెప్పండి” అని ఆదేశించారు. అయినప్పటికీ కలెక్టర్ వివరాలు చెప్పలేకపోవడంతో ఆయనపై మండిపడ్డారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలన్న ఆమె.. అప్పటికప్పుడు ఉజ్జాయింపుగా లెక్క చెప్పారు. 

‘‘కిలో బియ్యం రూ.35 అయితే.. ఇందులో కేంద్ర వాటా రూ.28 నుంచి రూ.30. లబ్ధిదారులు చెల్లించేది ఒక్క రూపాయి. అంటే రాష్ట్ర సర్కార్ ఇచ్చేది కిలోకు రూ.4 నుంచి రూ.5 ఉంటుంది” అని నిర్మల తెలిపారు. లోక్​సభ ప్రవాస్ యోజన ప్రోగ్రామ్ లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డిలో శుక్రవారం రెండో రోజు నిర్మల పర్యటించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపును సందర్శించారు. అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్​యోజన కింద కరోనా టైమ్ నుంచి ఉచితంగా బియ్యం ఇస్తోందని చెప్పారు. ఇవి ప్రజలకు అందుతున్నాయా? లేదా? అని కలెక్టర్ ను ప్రశ్నించారు. ఈ షాపులో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి అడగ్గా, 685 మంది ఉన్నారని కలెక్టర్ చెప్పారు. ‘‘2020 మార్చి, ఏప్రిల్​నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోంది. కొన్నాళ్లు కిలో పప్పు కూడా ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత  బియ్యం గురించి అందరికీ తెలియజేయాలి” అని కలెక్టర్​కు సూచించారు. మంత్రి మాట్లాడుతుండగా ఓ లబ్ధిదారుడితో డీలర్ దురుసుగా ప్రవర్తించడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటోళ్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. 

రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలె..
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. రేషన్​షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు. ట్రాన్స్​పోర్టు, గోదాం  ఖర్చులన్నీ భరించి పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే, రేషన్ షాపులో ప్రధాని ఫొటో లేకపోవడమేమిటని మండిపడ్డారు. కేవలం ఇక్కడే కాదని, రాష్ట్రవ్యాప్తంగానూ ప్రధాని ఫొటో పెట్టలేదన్నారు. తమ పార్టీ లీడర్లు ప్రధాని ఫ్లెక్సీలను రేషన్ షాపులో పెట్టడానికి వస్తే వారిని అడ్డుకున్నారని, ఫ్లెక్సీలు చింపివేశారని ఫైర్ అయ్యారు. ‘‘కచ్చితంగా రేషన్​ షాపులో ప్రధాని ఫొటో పెట్టాలి. లేకుంటే మా వాళ్లు వచ్చి పెడతారు. తొలగించటానికి వీల్లేదు’’ అని చెప్పారు. ‘‘ మోడీ ఫొటో పెట్టించండి. నేను మళ్లీ ఇక్కడికి వస్తాను. ఫొటో పెట్టడానికి ఎవరైనా అభ్యంతరం చెప్తే, జిల్లా ఆఫీసర్​గా చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్​కు సూచించారు. 

టీఆర్ఎస్​ దగుల్బాజీ విధానాలను ఎండగట్టండి...
కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి.. తమ పథకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని నిర్మల మండిపడ్డారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్​దగుల్బాజీ విధానాలను ఎండగట్టాలన్నారు. వర్ని మండల కేంద్రంలో బీజేపీ ఐటీ సెల్, సోషల్ మీడియా కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ‘‘రేషన్ బియ్యం రవాణా చార్జీలతో సహా కేంద్రమే రూ.29 భరిస్తోంది. కానీ టీఆర్ఎస్ సర్కార్ తామే మొత్తం ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించుకుంటోంది. దీనిపై ప్రజలకు వివరించాలి. రేషన్ బియ్యం కిలోకు కేంద్రం ఎంత ఇస్తోంది? రాష్ట్రం ఎంత ఇస్తోంది? అనేది ప్రజలకు చెప్పాలి” అని కార్యకర్తలకు సూచించారు. పైగా రేషన్ షాపుల్లో సీఎం కేసీఆర్ ఫొటో పెడుతూ, ప్రధాని మోడీ ఫొటో మాత్రం పెట్టడం లేదన్నారు. కేంద్ర నిధులు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీ అర్వింద్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నిర్మల కాన్వాయ్​ని అడ్డుకున్న ఎన్ఎస్​యూఐ నాయకులు..
బాన్సువాడ బస్టాండ్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్మల కాన్వాయ్ ని ఎన్ఎస్ యూఐ నాయకులు అడ్డుకున్నారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఎన్ఎస్ యూఐ నాయకులను తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, అంతకుముందు నిర్మల కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకుడు తృప్తి ప్రసాద్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. 

కరోనా టైమ్​లో హెల్త్ స్టాఫ్ సేవలు భేష్
కోటగిరి, వెలుగు: కరోనా సమయంలో హెల్త్ సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని నిర్మలా సీతారామన్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని సీహెచ్ సీని ఆమె సందర్శించారు. హెల్త్ సెంటర్ లోని సౌలతులు, కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ.. కరోనా టైమ్ లో అందించిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. కరోనాను మనం ఇంత తొందరగా ఎదుర్కోగలిగామంటే, అందుకు హెల్త్ సిబ్బందే కారణమని ప్రశంసించారు. ఇలాగే సేవలు కొనసాగించాలని, ప్రతి పేషెంట్ కు మెరుగైన వైద్యం అందించాలని 
సూచించారు.