కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రెస్ మీట్ లో  సీఎం కేసీఆర్  చెప్పినవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో అమిత్ షా, నడ్డా, సంతోష్ ల పాత్ర ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందని, ఆ అసహనంతోనే కేసీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిరాయి ఆర్టిస్టులతో వీడియో తీయించి.. అదే నిజమని నమ్మించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అయితే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ విడుదల చేసిన వీడియోలోని వ్యక్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆయన తేల్చి చెప్పారు.

ఈ మధ్య కాలంలో కేసీఆర్ నోరు తెరిస్తే జాతీయ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారని, ముందు రాష్ట్రాన్ని బాగు చేసి దేశం గురించి తర్వాత ఆలోచించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేసీఆర్.. దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.